కాజల్ పనయిపోయిందా? | Kajal Aggarwal To Romance Ilayathalapathy Again? | Sakshi
Sakshi News home page

కాజల్ పనయిపోయిందా?

Published Mon, Jan 11 2016 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

కాజల్ పనయిపోయిందా?

కాజల్ పనయిపోయిందా?

 చిత్ర పరిశ్రమలో ఒక అనారోగ్యకరమైన అంశం ఏమిటంటే ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోతే ఇక ఆ చిత్ర కథానాయకుడు లేదా కథానాయకి పనయిపోయిందనే అనే ప్రచారం జోరందుకుంటుంది. నిజానికి ఒక చిత్ర విజయానికైనా, అపజయానికైనా ఏ ఒక్కరో కారణం కాజాలరు. పలువురి సమష్టి కృషితోనే చిత్రం రూపొందగలదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల చిత్ర అపజయానికి హీరోనో, హిరోయిన్‌నో బలి చేయడం సరైంది కాదు.
 
 ఈ ఉపోద్ఘాతానికి కారణం లేక పోలేదు. నటి కాజల్ అగర్వాల్ విషయానికే వస్తే ఇటీవల ఆమె ధనుష్ సరసన నటించిన మారి చిత్రం కమర్షియల్‌గా ఓకే అనిపించుకుంది. అయితే ఆ తరువాత విశాల్‌కు జంటగా నటించిన పాయుంపులి చిత్రం నిరాశపరచింది. దీంతో కాజల్ పని అయిపోయిందనే ప్రచారానికి తెరలేపేశారు. అదే సమయంలో విక్రమ్‌తో రొమాన్స్ చేయాల్సిన చిత్రం కాజల్‌కు దూరం కావడం, అలాగే లారెన్స్‌తో నటించాల్సిన మొట్టశివ కెట్టశివ చిత్ర షూటింగ్ వాయిదా పడటం ఆ ప్రచారానికి ఇంకా దోహద పడిందని చెప్పవచ్చు.
 
  అయితే జయాపజయాలు సర్వసాధారణం అనే విషయాన్ని మరచిపోరాదు. ఏదేమైనా కాజల్ కోలీవుడ్‌లో మరో రౌండ్‌కు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. విక్రమ్‌కు జంటగా ఒక చిత్రం మిస్ అయినా మరో చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. తిరు దర్శకత్వంలో విక్రమ్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు తెలిసింది. తాజాగా ఈ బ్యూటీకి మరో భారీ అవకాశం వరించనున్నట్లు సమాచారం. ఇళయదళపతి విజయ్ 60 వ చిత్రంలో నాయకిగా కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసే పనిలో ఆ చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలిసింది.
 
 విజయ్‌తో కాజల్ ఇంతకు ముందు తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించారు. ఆ రెండు ఘన విజయాలు సాధించాయి. దీంతో కాజల్ ముచ్చటగా మూడోసారి ఇళయదళపతితో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించనుంది. విజయ్ ప్రస్తుతం తెరి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సమంత, ఎమీజాక్సన్ నాయికలుగా నటిస్తున్నారు. విజయ్ 60వ చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన వివరాలను యూనిట్ వర్గాలు సంక్రాంతి సందర్భంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement