చేతినిండా డబ్బుంటే చిత్రాలు తీయను
కమలహాసన్ గొప్ప నటుడు. నటనకు సరైన నిర్వచనం కమల్. ఎందుకంటే సినిమా అంటే కమల్. కమల్ అంటే సినిమా. ఐదు దశాబ్దాలకు పైగా సినిమాను కాచి వడబోసిన కళామతల్లి ముద్దుబిడ్డ కమల్. అంతగా సినిమాను ప్రేమించినా కమల్‌కు సినిమాలో కొన్నిసార్లు ఎదురీదక తప్పలేదు. అయితే ఎలాంటి ఆటుపోటులు కమల్‌ను ఏమి చేయలేకపోయారుు. విరుమాండి చిత్రానికి ముందు చండియర్ అనే పేరును కమల్ నిర్ణయించారు. అయితే ఆ టైటిల్‌కు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఆ టైటిల్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తరువాత వసూల్ రాజా ఎంబీబీఎస్ చిత్ర సమయంలో ఆ టైటిల్‌కు కొందరు డాక్టర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఆ మధ్య విశ్వరూపం చిత్ర విడుదల సమయంలో కమలహాసన్ ఎంత మనస్థాపానికి గురయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని విశ్వరూపం చిత్ర విడుదలకు మార్గం సుగమం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కమల్ కంట తడిపెట్టడం ప్రతి ఒక్క అభిమాని మనసను ద్రవింప చేసింది. అవసరమైతే మతసామరస్యం గల దేశానికి వలస పోవడానికి వెనుకాడనని అన్నారంటే ఆయన మనసు అప్పుడు ఎంత గాయపడిందో అర్థం చేసుకోవచ్చు. అయినా కమల్ సినిమాకు దూరం కాలేదు. కన్నతల్లిలా ప్రేమించే సినిమాను వదలడం ఆయనకంత సులభం కాదు. ఇప్పటికీ కమల్ స్వీయ దర్శకత్వంలో చిత్రాలు నిర్మిస్తూ నటిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన విశ్వరూపం -2 విడుదలకు ముస్తాబవుతోంది.
కమలహాసన్ ఇటీవల కె.వాయ్‌ముళి పేరుతో యు ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా అభిమానుల ప్రశ్నలకు బదులిస్తున్నారు. ఇటీవల నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ మీకు చేతి నిండా డబ్బు వస్తే ఎలాంటి చిత్రం చేస్తారు? అని ప్రశ్నించారు. అందుకు కమల్ బదులిస్తూ చేతినిండా డబ్బు ఉంటే చిత్ర నిర్మాణమే మానేస్తానని అన్నారు. అయితే చిత్రాలను చూసే ప్రేక్షకులను తయారు చేస్తానని చెప్పారు. తద్వారా నిర్మాతలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సినిమాను బతికి బట్టకడుతుంది ఎందుకంటే సినిమా అత్యంత ముఖ్యమైనవారు ప్రేక్షకులేనని కమల్ పేర్కొన్నారు.