పబ్బుల మీద బతికే వసూల్ రాజా!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు టార్గెట్లు పెట్టి మరీ కప్పం వసూలు చేస్తున్నాడు. తొలినాళ్లల్లో పోలీసులకు, పబ్స్‌కు మధ్య దళారిగా వ్యవహరించిన ఇతడు ప్రస్తుతం వాటి యజమానులను బెదిరించే స్థాయికి వెళ్లాడు. తనకు నెలనెలా మామూళ్లు చెల్లించకపోతే సిటీలో వ్యాపారం చేయలేరని, పోలీసులు, ఎక్సైజ్ విభాగాలతో పాటు నార్కోటిక్స్ వింగ్స్తోనూ దాడులు చేయిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఆయా అధికారులతో మాట్లాడిన ఆడియోలను సైతం వారికి షేర్ చేసి మరీ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో పబ్బులపై పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో దీన్నే పెట్టుబడిగా మార్చుకుని రెచ్చిపోతున్న ఈ వసూల్ రాజా బారి నుంచి తమను ఆదుకోవాలని పలువురు వేడుకుంటున్నారు. అధికారులను ఉసిగొల్పుతానంటూ.. నగరంలోని కొన్ని పబ్స్ యజమానులకు చోటా నేతగా పరిచయమైన ఈ వసూల్ రాజా.. హ్యూమన్‌రైట్స్ కార్యకర్త అని, ఓ సేన యాక్టివిస్ట్ అంటూ పోలీసులకు దగ్గరయ్యాడు. ఆపై సదరు పోలీసు అధికారుల సంబం«దీకులకు–పబ్స్ యజమానులకు మధ్య దళారీగా మారాడు. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది తమ వారు ఎవరైనా పబ్‌కు వెళ్లాలని భావిస్తే ఇతడిని సంప్రదించే వాళ్లు. వారిని పబ్‌కు పంపడమే కాకుండా బిల్లుల్లోనూ రాయితీలు ఇప్పించేవాడు. ఇలా కొన్ని పబ్స్‌ను తన చేతిలో పెట్టుకున్న సదరు దళారీ వాటి యజమానులకు టార్గెట్లు పెట్టి మరీ ప్రతి నెలా వసూళ్లకు పాల్పడ్డాడు. పోలీసులు, ఎక్సైజ్, నార్కోటిక్స్ విభాగాలతో పాటు ఇతరులకూ డబ్బు ఇవ్వాల్సి ఉందంటూ వారి నుంచి దండుకున్నాడు. ఆ అధికారులు ఎవరూ పబ్ జోలికి రాకుండా చూస్తానంటూ యజమానుల నుంచి డబ్బు తీసుకున్నాడు. నా మాట వినకుంటే అంతే.. 👉తన మాట వినని వారికి సంబంధించిన పబ్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ స్థానిక పోలీసులు, ప్రత్యేక విభాగాలకు ఈ దళారీ ఫోన్లు చేస్తుంటాడు. ఆ ఆడియోలను రికార్డు చేసి సదరు పబ్ యజమానికే పంపిస్తుంటాడు. అలా పంపిన తర్వాత పోలీసులతో తనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, తన మాట వినకుంటే దాడుల చేయిస్తానని బెదిరింపులకు దిగి వసూళ్లు చేస్తున్నాడు. ఎంతకీ తన మాట వినని పబ్స్ యజమానులకు తన దారికి తెచ్చుకోవడానికి సదరు దళారీ పోలీసులను వినియోగించుకుంటాడు. 👉 ఆయా పబ్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, యువత పెడదారి పడుతున్నారని, స్థానిక మహిళలు తనకు ఫిర్యాదు చేశారంటూ పోలీసులకు ఫోన్లు చేస్తాడు. తక్షణం దానిపై దాడి చేసి, సోదాలు చేయాలని కోరతాడు. వారు పట్టించుకోకుంటే పై స్థాయి «అధికారులకు ఫోన్లు చేయడం ప్రారంభిస్తాడు. ఆపై పబ్స్ యజమానిని సంప్రదించి అధికారులతో మాట్లాడిన ఆడియో రికార్డులు షేర్ చేస్తాడు. 👉తడి బెదిరింపులు తట్టుకోలేకపోయిన కొందరు పబ్స్ యజమానులు తమ సంస్థలు అయినకాడికి అమ్ముకుని నగరం విడిచి వెళ్లిపోయారు. మరికొందరు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఈ దళారీ బెదిరింపులకు భయపడి ప్రోత్సహించవద్దని, అతడి బారి నుంచి తమను కాపాడాలని పబ్స్ యజమానులు పోలీసులను వేడుకుంటున్నారు.