అన్నయ్య వస్తే ఆంతర్యమా?
Published Sun, Apr 6 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి భేటీ గురించి కరుణానిధి గారాల పట్టి కనిమొళి పెదవి విప్పారు. అన్నయ్య కలిసిన మాట వాస్తవమేనని, కుశల ప్రశ్నలు, ఆరోగ్య క్షేమాల గురించి మాత్రమే తనతో అళగిరి వాకబు చే శారని, అందులో ఆంతర్యమేమీ లేదని వివరించారు. శనివారం ప్రచారబాట పట్టే ముందుగా మీడియాతో కనిమొళి మాట్లాడారు.
సాక్షి, చెన్నై:డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఓ వైపు ఎంకే స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో ఉన్నారు. మరో వైపు తాను సైతం అంటూ అధినేత ఎం కరుణానిధి ప్రచారానికి కదిలారు. వయోభారాన్ని పక్కన పెట్టి రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రచార సభల రూపంలో కరుణానిధి ముందుకు సాగుతున్నారు. ఇది వరకు ఎన్నికల ప్రచారాలకు ప్రత్యక్షంగా వెళ్లని కరుణానిధి గారాల పట్టి కనిమొళి తాజాగా అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు సిద్ధం అయ్యారు.
శనివారం దక్షిణ చెన్నైలోని తమ పార్టీ అభ్యర్థి టీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతుగా ఓట్ల వేటతో ప్రచారానికి కనిమొళి శ్రీకారం చుట్టారు. సీఐటీ కాలనీలోని తన నివాసం నుంచి బయలు దేరే ముందుగా ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు కనిమొళి సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా గతం వారం తన పెద్ద అన్నయ్య, డీఎంకే బహిష్కృత నేత అళగిరి తనతో భేటీ కావడం గురించి పెదవి విప్పారు. ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో కనిమొళి ఇంటికి అళగిరి స్వయంగా వెళ్లడంతో ఆంతర్యాన్ని కని పెట్టే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. అయితే, ఇందులో ఎలాంటి రాజకీయం లేదంటూ కనిమొళి స్పష్టం చేశారు.
అళగిరి భేటీలో ఆంతర్యమేమిటో..?
చెల్లెమ్మను అన్నయ్య కలవడంలో ఆంతర్యం ఉంటుందా?
పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించారే? ఆ విషయం ప్రస్తావనకు రాలేదా..?
లేదు. కేవలం నా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కుశల ప్రశ్నలు వేసుకున్నాం.
సర్వేలు అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉన్నట్టుందే?
ఒక్కో సర్వే ఒక్కొకటి చెబుతోంది. తొలుత అన్నాడీఎంకేకు 30 స్థానాలు తథ్యం అని సర్వేలు చెప్పాయి. ఇప్పుడు అదే సర్వేలు 18 నుంచి 20లోపే అంటున్నాయి. ఎన్నికల నాటికి ఆ సంఖ్య మరికొన్ని తగ్గడం తథ్యం.
అదెలా తగ్గుతాయో?
తమ అధినేత కరుణానిధి ప్రచార బాట పట్టే సరికి సర్వేల్లోను సంఖ్యలు మారాయి. ఇప్పుడు ఆయన సుడిగాలి పర్యటనతో ప్రజల్లోకి వెళ్లారు. అధినేత రాకతో అభ్యర్థుల్లో బలం పెరిగింది. ఎన్నికల నాటికి అన్నాడీఎంకే సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఇది మరో సర్వేతో స్పష్టం అవుతుంది.
మీ మీద, మీ ఎంపీ రాజా మీద ‘2జీ’అవినీతి ఆరోపణ లు ఉన్నాయే?మరి ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు..?
ఇలాంటి ఆరోపణల వెనుక రాజకీయ కారణాలు ఉంటారుు. మా విషయంలో అదే జరిగింది. నిజాలు ఏదో ఒక రోజు బయటకు వచ్చి తీరుతాయి. తాము నిర్దోషులం అని తేలుతుంది. మా మీద మోపిన నిందల గురించే అందరూ ప్రస్తావిస్తున్నారేగానీ, ఏళ్ల తరబడి బెంగళూరు కోర్టులో వాయిదాల మీద వాయిదాలతో సాగుతున్న ఆమె(జయలలిత) అవినీతి కేసు గురించి పట్టించుకోరా? ఎవరు మంచి వాళ్లో, చెడ్డ వారో ప్రజలకు తెలుసు.
మీ అభ్యర్థులందరూ కోటీశ్వరులేనట?
ఒకరిద్దరు మాత్రమే కోటీశ్వరులు ఉండొచ్చు. మిగిలిన వారందరూ చదువుకున్న విద్యావంతులు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే.
ఈలం తమిళుల విషయంలో డీఎంకే కపటనాటకం ప్రదర్శించ లేదా?
ఆ అవసరం తమకేంటి. ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా ఆ నాటి నుంచి ఉద్యమిస్తున్నదని కలైంజర్ కరుణానిధి. కేంద్రంలోని యూపీఏతో తరచూ ఢీ కొట్టారు. ఆయన ఒత్తిడి మేరకు రెండు సార్లు శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానాలకు ఐక్యరాజ్య సమితిలో భారత్ మద్దతు ఇచ్చింది. తాము ప్రస్తుతం ఆ కూటమిలో లేనప్పటికీ, ఒత్తిడి తెచ్చాం. అయితే, కేంద్రం శ్రీలంకకు వత్తాసు పలికింది. ఇదెలా కపట నాటకం అవుతుంది.
ప్రచారంలో తమరి అస్త్రం?
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు. సుపరి పాలన పేరుతో సాగుతున్న అవినీతి బండారాలు. ప్రజల్ని మభ్య పెట్టే విధంగా సాగుతున్న ప్రకటన, ఉత్తర్వుల వ్యవహారాలు.
విద్యుత్ సంక్షోభం డీఎంకే ఘనత కాదంటారా..?
ఇది ముమ్మాటికి తప్పుడు సంకేతం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కలైంజర్ అనేక విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అన్నీ పూర్తి కావచ్చిన సమయానికి అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టింది. ఆ పథకాల్ని కొనసాగించి ఉంటే, సంక్షోభం ఉండేది కాదు. కొత్త ప్రాజెక్టులంటూ, తమ ప్రాజెక్టులను పక్కన పెట్టడంతో గ్రామాలు అంధకారంలో మునిగి ఉన్నాయి. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు నిందల్ని మా మీద వేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాం.
Advertisement
Advertisement