వెంకయ్యకు వ్యతిరేకంగా నిరసనలు
బెంగళూరు : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుపై కర్ణాటకలో నిరసన వ్యక్తమవుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో వెంకయ్యను కర్ణాటక కోటాలో ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. దానికనుగుణంగా బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది.
ఈ తరుణంలో వెంకయ్యను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపరాదంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియాల్లో నెటిజన్లు పోస్టర్లు పెడుతున్నారు. కర్ణాటకకు చెందన వారినే రాజ్యసభకు పంపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు నెటిజన్లకు మద్దతు తెలుపుతూ మంగళవారం బెంగళూరు, చిక్కబళాపురతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వెంకయ్య దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.