ఏడాది సస్పెన్షన్!
Published Mon, Nov 28 2016 2:27 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
సాక్షి, చెన్నై: సీఐఎస్‌ఎఫ్‌తో వివాదం తొమ్మిది మంది న్యాయవాదులకు సంకటంగా మారింది. ఏడాది పాటు వారిని సస్పెండ్ చేస్తూ కర్ణాటక బార్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లడానికి న్యాయవాదులు కసరత్తుల్లో పడ్డారు.
మద్రాసు హైకోర్టు ఆవరణలో కొందరు న్యాయవాదుల చర్యలు వివాదాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. వాటికి ముగింపు పలికే విధంగా ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్‌కౌల్ గతేడాది నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టును సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. దీన్ని నిరసిస్తూ పలువురు న్యాయవాదులు వివాదాల్ని కొని తెచ్చుకున్నారు. మహిళా న్యాయవాదిని తనిఖీ చేసే క్రమంలో సీఐఎస్‌ఎఫ్ వర్గాలు హద్దులు మీరి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు కయ్యానికి కాలు దువ్వడం వివాదాస్పదంగా మారింది.
సీఐఎస్‌ఎఫ్‌తో దురుసుగా వ్యవహరించారన్న నెపంతో పలువురు న్యాయవాదుల్ని సస్పెండ్ చేస్తూ తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలూ సాగారుు. చివరకు జాతీయ బార్ కౌన్సిల్ జోక్యం చేసుకుని ఈ వ్యవహారాన్ని కర్ణాటక బార్ కౌన్సిల్‌కు అప్పగించింది. ఆదివారం ఆ బార్ కౌన్సిల్ తొమ్మిది మంది న్యాయవాదుల్ని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. దీన్ని వారి సహచరులు జీర్ణించుకోలేకున్నారు. కొత్తగా ఏర్పడ్డ న్యాయవాద సంఘం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయంపై అప్పీలుకు సిద్ధమవుతున్నారు.ఈ పరిణామాలు మళ్లీ ఎక్కడ విచారణలకు ఆటంకాలుగా మారనున్నాయో వేచి చూడాల్సిందే.
హైకోర్టుకు తాళం: శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వరకు హైకోర్టు పరిధిలోని అన్ని గేట్లకు ఓ వ్యక్తి తాళం వేసి, ఆ చెవిని ప్యారిస్‌లోని పెరుమాల్ ఆలయంలో సమర్పించాడు. ప్రతి ఏటా నవంబర్ చివరి ఆదివారం 24 గంటల పాటు హైకోర్టుకు తాళం వేయడం ఆ చెవిని తీసుకెళ్లి ప్యారిస్‌లోని పెరుమాల్ ఆలయంలో ఉంచడం, ఆ సమయం గడిచినానంతరం కోర్టు భద్రతా వర్గాలకు అప్పగించడం జరుగుతూ వస్తోంది. ఇలా ఉండగా శనివారం రాత్రి ఎనిమిది గంటల తాళం వేసి ఆలయంలో చెవిని సమర్పించారు. దీంతో న్యాయవాదుల ప్రవేశ మార్గంతో పాటు మరో ఆరు మార్గాలకు తాళం పడింది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత మళ్లీ చెవిని తీసుకొచ్చి ఆ తాళం తెరిచారు.
Advertisement
Advertisement