
కావేరి వివాదం; కర్ణాటక సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదంటూ శుక్రవారం కర్ణాటక శాసనమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ రోజు ఆ రాష‍్ట్ర శాసనమండలి ప్రత్యేకంగా సమావేశమై సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించింది. ఈ నెల 27 వరకు కావేరి నది నుంచి రోజూ 6 వేల క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కావేరి జలాలు కర్ణాటక ప్రజల తాగునీటి అవసరాలకు చాలా అవసరమని ఆ రాష్ట్ర శాసనమండలిలో అన్ని పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. కావేరి జలాశయాల్లో నీటిమట్టం పడిపోయినందున తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదని, పూర్తిగా కర్ణాటక ప్రజల తాగునీటి అవసరాలకు వాడాలని నిర్ణయించారు. చర్చ అనంతరం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కర్ణాటక శాసనమండలి బేఖాతరు చేయడంతో ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయన్నది న్యాయ నిపుణుల్లో ఉత్కంఠగా మారింది. కాగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. కావేరి జలాల విడుదలపై కర్ణాటక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో పార్టీలకతీతంగా సుప్రీం తీర్పును వ్యతిరేకించారు.