ఆత్మీయ పెన్నిధి!
► ఘనంగా కరుణ జన్మదిన వేడుకలు
► వజ్రోత్సవానికి వెల్లువెత్తిన అభిమానులు
► అభినందనలతో ముంచెత్తిన రాజకీయ నేతలు
► కరుణది ప్రజల వాణి: రాహుల్
► అవిశ్రాంత నాయకుడు నాన్న : స్టాలిన్
తమిళనాట శనివారం పండగ వాతావరణం నెలకొంది. రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి 94వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ సంబరాలు అంగరంగవైభవంగా సాగాయి. చెన్నై రాయపేట వైఎమ్‌సీఏ మైదానం అభిమానులతో కిక్కిరిసిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ నాయకులు కరుణానిధి సేవలను కొనియాడారు. ఆయన మరిన్ని సేవలు చేయాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లు, ఈమెయిళ్ల ద్వారా దేశం మొత్తం నుంచి 60 లక్షల మంది శుభాభినందనలు తెలిపారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజావేదికపై కరుణానిధి చేసేది రాజకీయ ప్రసంగాలు కాదు, ప్రపంచం నలుమూలలా ఉన్న తమిళప్రజల వాణిగా అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారు. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్షుడు కరుణానిధి 94వ జన్మదిన వేడుకలు, 60 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా వజ్రోత్సవ వేడుకలు చెన్నై రాయపేట వైఎంసీఏ మైదానంలో శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ నాయకులు కరుణానిధిని కీర్తిస్తూ ప్రసంగించారు. రాహుల్ మాట్లాడుతూ శరద్‌పవార్, నితీష్‌కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్ వీరి మాటలు, వారివారి రాష్ట్రాల ప్రజల మనోభావాలకు అద్దంపడతాయని అన్నారు. పార్టీలు, సిద్ధాంతాలువేరు కావచ్చు, కానీ తామంతా దేశ ప్రజల సంక్షేమ కోసమే పాటుపడుతున్నామని అన్నారు.
కరుణానిధి సైతం ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తారు, అవన్నీ కల్పనలు కాదు వాస్తవాల కోసం పాటుపడుతున్నారని చెప్పారు. గత 70 ఏళ్లుగా తమిళ భాష ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా చాటుతున్నారు. తమిళభాష బలమే దేశ బలమని అన్నారు. దేశంలోసాగుతున్న ఏకపక్ష పాలనకు చరమగీతం పాడేలా భారతదేశం తామంతా సమష్టిగా పోరాడుతాం, పాటుపడతామని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం కాదు చేతలతో చూపెట్టాలని ప్రధాని మోదీని అయన ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద సభను నిర్వహించిన స్టాలిన్‌ను అభినందిస్తున్నా, ఒక గొప్ప మనిషి బాధ్యతలను స్టాలిన్ త్వరలో చేపట్టబోతారని చెప్పారు. స్టాలిన్ సరైన బాటలో పయనిస్తున్నారు.
ఒకనాడు నేడు కరుణలా స్టాలిన్ గురించి మాట్లాడుకోవడం ఖాయమని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ అధ్యక్షతన, కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సభకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరై కరుణకు జేజేలు పలికారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయస్థాయి ప్రతిపక్షనేతలు కరుణానిధి రాజకీయ జీవితాన్ని ప్రస్తావించి కీర్తించారు. ఒక రాజకీయ వేత్తగా 60 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగడం ద్వారా తమిళనాడు ప్రజల్లో ఆయనకున్న సముచిత స్థానాన్ని చాటుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేసిన కీర్తి కరుణకు సొంతమని అన్నారు. 94 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఆయనలోని రాజకీయ చతురత, పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి ఏ మాత్రం తగ్గలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే అనారోగ్యకారణంగా ఈ వేడుకల్లో మనమధ్య ఆయన లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రజల ముందుకు కరుణ గళం: స్టాలిన్
తమ అభిమాన నేతను కలుసుకోవాలని పార్టీ కార్యకర్తలు, చూడాలని ప్రజలు ఎంతోకాలంగా తహతహలాడుతున్నారి స్టాలిన్ అన్నారు. త్వరలో ఈ ఆశ తీరుతుంది, కరుణ గళాన్ని వినే అవకాశం ముందుందని చెప్పారు.ప్రజల మేలు గురించి కరుణానిధి ఆలోచనలకు విశ్రాంతి లేదని స్టాలిన్ అన్నారు. రాజకీయాల్లోకి అడుగిడిన నాటి నుంచి ప్రజలకు అంకితమయ్యారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలకు ఆయన ఒక దిక్సూచీ అని అన్నారు. ఆయన ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే జన్మదిన బహుమతి అని అన్నారు.
కరుణకు 60 లక్షల మంది శుభాకాంక్షలు:
భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేరళ గవర్నర్ సదాశివం, తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మూర్ము, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కేరళ సీఎం పినరాయ్ విజయన్, పీఎంకే అధినేత రాందాస్, సహా మొత్తం 60 లక్షల మంది కరుణానిధికి శుభాకాంక్షలు అందజేశారు.
సోనియా పంపిన సందేశాన్ని కరుణకు చదివి వినిపించారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, వీసీకే అధినేత తిరుమావళవన్, పుదియనీది నిరువణ అధ్యక్షుడు ఏసీ షణ్ముగం, పెరుంతలైవర్ మక్కల్ కట్చి అధ్యక్షులు ఎన్‌ఆర్ ధనపాళన్, సమత్తువ మక్కల్ కళగ నేత ఏ నారాయణన్, చెంగల్పట్టు ఎమ్మెల్యే వరలక్ష్మి మధుసూదనన్ తన సొంతూరైన అంబూరులో పార్టీ జెండా ఎగురవేసి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఎక్కడిక్కడక డీఎంకే అనుబంధ కార్మిక సంఘాలు మిఠాయిలు పంచుకుని సంబరం జరుపుకున్నాయి. తన తండ్రిపై ఎంపీ కనిమొళి కవితను రాసి విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలు కరుణ జీవితంపై ఒక డాక్యుమెంటరీ తీశారు.