
వజ్రోత్సవాలకు కరుణ దూరం
► గోపాలపురానికే పరిమితం
► వైద్యుల సూచన మేరకు నిర్ణయం
► డీఎంకే శ్రేణులకు నిరాశ
► శుభాకాంక్షల కోసం ప్రత్యేక వెబ్‌సైట్
సాక్షి, చెన్నై: వజ్రోత్సవ వేడుక వేదికపై డీఎంకే అధినేత ఎం.కరుణానిధి దర్శనం ఇస్తారన్న ఆశతో ఉన్న ఆ పార్టీ శ్రేణులకు నిరాశే మిగిలింది. ఆ వేడుకకు దూరంగా గోపాలపురం ఇంటికే కరుణానిధి పరిమితం కానున్నారు. వైద్యుల సూచన మేరకు మరి కొన్నాళ్లు ఆయన ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. అయితే, వజ్రోత్సవ వేడుక విజయవంతం లక్ష్యంగా, కరుణానిధికి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను డీఎంకే అధిష్టానం ఏర్పాటు చేయడం విశేషం.
డీఎంకే అధినేత ఎం కరుణానిధి వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఆయన గోపాలపురం ఇంటికే పరిమితం అయ్యారు. విశ్రాంతిలోఉన్న కరుణానిధిని చూసేందుకు ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ లేదా, ఎంపీ కనిమొళి తమ సామాజిక మాధ్యమాల్లో కరుణానిధి ఫొటోలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇది డీఎంకే వర్గాలకు కాస్త ఆనందమే. ఈ పరిస్థితుల్లో జూన్ మూడో తేదీ కరుణానిధి 94వ వసంతంలోకి అడుగు పెట్టనుండం, 60 ఏళ్లు అసెంబ్లీకి ఓటమి ఎరుగని యోధుడి వలే విజయ కేతనం ఎగుర వేస్తూ రావడాన్ని పరిగణలోకి తీసుకుని వజ్రోత్సవ వేడుకకు డీఎంకే అధిష్టానం నిర్ణయించింది. ఈ వేదికపై కరుణానిధి వస్తారని తొలుత ప్రచారం సాగింది.
ఈ వేడుకకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పక్షాల నాయకులు హాజరుకానున్నారు. ఈ వేదికపై తమ అధినేత కరుణానిధి దర్శనం ఇస్తారన్న ఆశతో ఉన్న పార్టీ వర్గాలకు తాజాగా మిగిలింది నిరాశే. కరుణానిధి వజ్రోత్సవ వేడుకలకు దూరంగా గోపాలపురం ఇంటికే పరిమితం కానున్నారు. ఇందుకు తగ్గట్టు మంగళవారం డీఎంకే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్యులు సూచన మేరకు మరికొంత కాలం కరుణానిధికి విశ్రాంతి అవసరం అని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే కరుణానిధిని ఎవ్వరూ కలవకుండా ఉండడమే మంచిదన్న సూచనను వైద్యులు చేసినట్టు వివరించారు. తన జన్మదినం వేళ అందరి ముందుకు కరుణానిధి వస్తారని భావించామని అయితే, వైద్యుల సూచన మేరకు తుది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటించారు.
కరుణానిధికి శుభాకాంక్షలు తెలపాలని, కానుకలు అందించాలన్న ఆశ కేడర్‌కు ఉంటుందని, అయితే, ఆయన ఆరోగ్య సమస్య, విశ్రాంతిని పరిగణించి మరి కొంత కాలం దర్శనం కోసం ఎదురు చూడక తప్పదని పేర్కొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అందరి ముందుకు రావాలన్నదే ఈఎంకే కేడర్ ఎదురుచూపు అని, ఇది త్వరలో జరిగి తీరుతుందని ప్రకటించారు. ఇక, కరుణానిధికి శుభాకాంక్షలు తెలిపే వారి కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. వెబ్‌సైట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయవచ్చని సూచించారు. మూడో తేదీ వజ్రోత్సవ వేడుకకు హాజరు కానున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని సత్యమూర్తి భవన్‌కు ఆహ్వానించేందుకు తగ్గ ఏర్పాట్లను కాంగ్రెస్ వర్గాలు చేస్తున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో రాహుల్ సమావేశం అయ్యే విధంగా, ఇక్కడి సమస్యలు, పార్టీ కార్యవర్గంలో మార్పులు చేర్పుల ప్రస్తావన రాహుల్ ముందు ఉంచేందుకు తగ్గ కసరత్తులు జరుగుతున్నాయి. అయితే, ఇందుకు రాహుల్ సమయం కేటాయించేనా అన్నది వేచి చూడాల్సిందే.