లంచం ఇవ్వకుండా కౌర్ చూపిన తెగువను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడిలో గాయపడిన రమన్‌జీత్
కానిస్టేబుల్ దాడిలో గాయపడిన మహిళను అభినందించిన కేజ్రీవాల్
రాష్ట్రం నీ లాంటి పౌరులను
కోరుకుంటుంది
అవినీతిపై పోరాడే వారికి
వెన్నంటే ఉంటాం
న్యూఢిల్లీ: లంచం ఇవ్వకుండా కౌర్ చూపిన తెగువను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడిలో గాయపడిన రమన్‌జీత్ కౌర్‌ను ఆయన మంగళవారం కలిశారు. సెంట్రల్ ఢిల్లీలో సోమవారం ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ లంచం ఇవ్వనందుకు మహిళపై ఇటుకతో దాడి చేసిన సంగతి విదితమే. రాష్ట్రంలోని ప్రజలందరూ కౌర్‌లాగా ఉండాలన్నారు. అప్పుడే అవినీతిని అంతమొందించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ దాడిలో గాయపడిన తనకు సరైన చికిత్స అందించడం లేదని సీఎంకు ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆమెకు మెరుగైన చికిత్సనందించాలని అధికారులను ఆదేశించారు. ‘నిన్ను చూసి మేము గర్వపడుతున్నాం. మేము నీ వెన్నంటే ఉండి చేయగలిగినంత సాయం చేస్తాం.
ఢిల్లీ నీ లాంటి పౌరులను కోరుకుంటుంది. అవినీతిని అంతమొందించేందుకు మనమంతా కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని కేజ్రీవాల్ అన్నారు. తమకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వలేదని, దీంతో సరైన వైద్యం అందించడం లేదని కౌర్ భర్త సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌ఐఆర్ విషయం తాను చూసుకుంటునాని, మెరుగైన చికిత్సనందించేలా ఆదేశాలిస్తానని సీఎం హామీనిచ్చారు. కౌర్‌కు మెరుగైన చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కేజ్రీవాల్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కౌర్, ఆమె భర్తను జైన్ కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
హెడ్ కానిస్టేబుల్‌కు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ
మహిళపై దాడి కేసులో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్‌కు ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మే 26 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి నరోత్తమ్ కౌశల్ ఆదేశాలు జారీ చేశారు.