
మౌన విలాపం
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలుకావడం కోలీవుడ్‌ను కదిలించివేసింది. వెండితెర, బుల్లితెరలకు చెందిన కళాకారులంతా బరువెక్కిన హృదయాలతో మంగళవారం మౌనంగా నిరాహారదీక్ష చేపట్టారు. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు రద్దయ్యాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజకీయాలను, కోలీవుడ్‌ను రెండు కళ్లుగా భావిస్తారు. సమాన ప్రాధాన్యత నిస్తారు. అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత అందరూ సినీరంగానికి చెందిన ప్రముఖులే కావడమే ఇందుకు కారణం. ముఖ్యమంత్రిగా జయ సైతం కోలీవుడ్‌ను ఎంతో ఆదరించారు. అకస్మాత్తుగా ఆమె జైలు పాలుకావడం జీర్ణించుకోలేని కోలీవుడ్ కన్నీరు పెట్టుకుంది. సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. జైలు నుంచి జయ విడుదలను ఆకాంక్షిస్తూ చెన్నై చేపాక్‌లోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద మంగళవారం మౌన నిరాహారదీక్షను చేపట్టింది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఆధ్వర్యంలో నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం, డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య, చెన్నై నగర థియేటర్ యజమానుల సంఘం, బుల్లితెర కళాకారుల సంఘం, సినిమా పీఆర్వోల సంఘం ఇలా 24 క్రాఫ్ట్‌లకు చెందిన కళాకారులు, ఉద్యోగులు, కార్మికులు దీక్షకు ఉపక్రమించారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షల్లో కూర్చున్నారు. మౌనదీక్ష కావడంతో ఎవరూ ప్రసంగాలు చేయలేదు. కొందరు టీవీ మీడియా వారు వేరుగా ఇంటర్వూలు తీసుకున్నారు. లింగా షూటింగ్ నిమిత్తం వేరే ఊరిలో ఉన్న కారణంగా రజనీకాంత్, అనారోగ్య కారణాల వల్ల కమల్‌హాసన్ దీక్షలో పాల్గొనలేదు. కోలీవుడ్ దీక్ష కారణంగా కలైవానర్ అరగం మీదుగా బీచ్‌కు వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. వెండితెర, బుల్లితెర షూటింగులను రద్దు చేశారు. సంఘం అధ్యక్షులు శరత్‌కుమార్, నటులు ప్రభు, భాగ్యరాజ్, సత్యరాజ్, వివేక్, రాధారవి, నటిలు నళిని, కుయిలీ, వెన్నిరాడై నిర్మల, సచ్చు, దర్శకులు పీ వాసు తదితరులు పాల్గొన్నారు. కోలీవుడ్‌కు చెందిన మరో బృందం అమ్మ ఇంటికి సమీపంలో పోయెస్ గార్డెన్ వద్ద ధర్నా నిర్వహించింది.