శ్రీలంకపై కోలీవుడ్ ధ్వజం
చెన్నై, సాక్షి ప్రతినిధి:‘అమ్మ’ అంటూ తమిళులు ఎంతో అభిమానంగా పిలుచుకునే ముఖ్యమంత్రి జయలలితకు శ్రీలంక అధికారిక ఆర్మీ వెబ్‌సైట్‌లో జరిగిన అవమానంపై కోలీవుడ్ ధ్వజమెత్తింది. చెన్నై నుంగంబాకం కాలేజీ రోడ్‌లోని శ్రీలంక రాయబార కార్యాలయం వద్ద సోమవారం ధర్నాకు దిగింది. రాజపక్సే దిష్టిబొమ్మ దహనం చేసింది. శ్రీలంక చేతిలో తరచూ వేధింపులకు గురవుతున్న తమిళ జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటూ అక్కడి జైళ్లలో మగ్గుతున్న జాలర్లను, మరపడవలను విడిపించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇటీవల లేఖలు రాశారు. ఈ లేఖలపై శ్రీలంక ఆర్మీ తన వెబ్‌సైట్‌లో వ్యంగ్యాస్త్రాలను విసిరింది.
పీఎం, సీఎం వంటి ఉన్నత స్థానాల్లో ఉన్న మోడీ, జయలను కించపరిచింది. దీనిపై రాష్ట్రంలో తీవ్రనిరసనలు పెల్లుబికాయి. ఇం దులో భాగంగా జయకు బాసటగా నిలుస్తూ కోలీవుడ్ తరలి వచ్చింది. ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం వద్ద ధర్నాకు దిగింది. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను శిక్షించాలని, ఆ దేశంపై ఆర్థిక నిషేధం విధించాలని తమిళ నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కచ్చదీవులు శ్రీలంకకు మాత్రమే సొంతం కావని సీనియ ర్ నటులు శివకుమార్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం ఆవిర్భవించిన రాయబార వ్యవస్థ శ్రీలంక వల్ల చెడగొట్టే వ్యవస్థగా మారిందని సీనియర్ దర్శకులు ఆర్కే సెల్వమణి విమర్శించారు. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ నాయకత్వంలో 24 విభాగాలకు చెందిన వారంతా పెద్ద సం ఖ్యలో ధర్నాలో నినాదాలతో హోరెత్తించారు. నటీ నటులు శివకుమార్, సూర్య, విజయ్, భాగ్యరాజ్, వివేక్ సహా వందలాది సినీ ప్రముఖులు, పలువురు నటీమణులు నిరసనలో పాల్గొనడంతో వారిని చూసేందుకు సాధారణ ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చింది. అయితే పోలీసు లు వారిని అనుమతించలేదు. కోలీవుడ్ ధర్నాను పురస్కరించుకుని 300మందికి పైగా పోలీసులు అక్కడ మోహరించారు. ఈ సందర్భంగా కోలీవుడ్ ప్రముఖులు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు పెట్రోల్ పోశారు. ఇంతలో వారి ని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే రాయబార కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నానికి కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించిన పోలీసులు అడ్డుతగిలారు. ఉదయం 10.30గంటలకు ప్రారంభమైన కోలీవుడ్ ధర్నా మధ్యాహ్నం 12.15 గంటలకు ముగిసింది.
శ్రీలంక క్రికెట్ జట్టు తిరుగుముఖం
శ్రీలంక తీరుపై రాష్ట్రం ఒకవైపు అట్టుడికి పోతుండగా అండర్-16 క్రికెట్‌లో ఆడేం దుకు చెన్నైకి చేరుకున్న శ్రీలంక జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ తమిళనాడు అధ్యక్షతన చెన్నైలోని వైఎమ్‌సీఏ మైదానంలో అండర్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. భారత్, మలేషియాతోపాటూ పోటీల్లో పాల్గొనేందుకు 13 మంది క్రీడాకారులు, ముగ్గురు శిక్షకులతో శ్రీలంక జట్టు ఆదివారం రాత్రి చెన్నై చేరుకుంది. సోమవారం కోలీవుడ్ ధర్నా చేస్తున్న సమయంలో వీరు క్రికెట్ ఆడితే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని తలంచిన రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో సోమవారం ఉదయం 9.55 గంటలకు శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులు తిరుగు ప్రయనమయ్యూరు. శ్రీలంక వ్యవహారంపై చర్చించేం దుకు సోమవారం నాటి అసెంబ్లీలో స్పీకర్ నిరాకరించగా, చెన్నై శివార్లలోని షోలింగనల్లూరులో రాజపక్సే దిష్టిబొమ్మను అన్నాడీఎంకే శ్రేణులు దహనం చేశాయి.