సాక్షి, చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎడిపాడి పళినిస్వామి, స్పీకర్ ధనపాల్‌కు చీర, నైటీలను పంపిన ఎనిమిదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోడ్ ఈస్ట్ జిల్లా కొంగునాడు వెట్టువగౌండర్ యువజన సంక్షేమ సంఘం కార్యదర్శి జగదీశన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు గురువారం ఈరోడ్ తపాలా కార్యాలయానికి చేరుకున్నారు. వీరు సీఎంకు నైటీ, స్పీకర్‌కు చీర పంపేందుకు వినూత్న ఆందోళన జరిపారు.
దీని గురించి వారు మాట్లాడుతూ మెజార్టీ కోల్పోయిన పళనిస్వామి ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరిపేందుకు ఉత్తర్వులివ్వని స్పీకర్ ధనపాల్, 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని, ఇది ప్రజాస్వామిక హత్యని విమర్శించారు. మైనార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించే ఎడపాటి వైఖరిని నిరసిస్తూ ఆందోళన జరుపుతున్నట్లు తెలిపారు. నిరసనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు.