కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలో మంగళవారం వేకువజామున ఉత్పత్తి ఆరంభమైంది. తొలిరోజు 160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్పత్తిని బుధ వారం నుంచి క్రమంగా పెంచనున్నామని వెల్లడించారు. అయి తే ఇదంతా ఓ నాటకమంటూ ఉద్యమకారులు కొట్టిపారేశారు.
సాక్షి, చెన్నై:తిరునల్వేలి జిల్లా కూడంకులంలో భారత్, రష్యా సంయుక్తంగా అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. తొలి యూనిట్ పనులు ముగిశాయి. రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా ఇడిందకరై వేదికగా పెద్ద ఉద్యమమే సాగింది. ఫలితంగా తొలి యూనిట్‌లో అధికారిక ఉత్పత్తికి బ్రేక్ పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకుల్ని అధిగమించి జూలైలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ గత నెలలో కూడంకులంలో పర్యటించింది. ఈ కేంద్రం సురక్షితమని ప్రకటించింది. ప్రస్తుతం ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా పర్యటనలో ఉండడాన్ని పురస్కరించుకుని అధికారిక ఉత్పత్తికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని అణు కేంద్రం డెరైక్టర్ సుందర్ మీడియాకు ప్రకటించారు.
160 మెగావాట్ల ఉత్పత్తి
మంగళవారం వేకువజామున 2.45 గంటలకు అణు విద్యుత్ కేంద్రంలో అధికారిక ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని సుందర్ వెల్లడించారు. తొలి విడతగా రెండు గంటలు ఉత్పత్తి జరిగిందని వివరించారు. అణు రియాక్టర్లు, టర్బైన్, జనరేటర్ల పనితీరు అద్భుతమని ప్రకటించారు. మొత్తం 70 మెగావాట్లతో ప్రారంభమై 160 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి చేరుకుందని వివరించారు. ఈ విద్యుత్‌ను సదరన్ గ్రిడ్‌కు పంపించామన్నారు. అక్కడ పరిశీలన అనంతరం ప్రజా వినియోగానికి అణు విద్యుత్ ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.
నేటి నుంచి పెంపు
విద్యుత్ ఉత్పత్తి బుధవారం నుంచి క్రమంగా పెరగనుంది. తొలి విడతగా 400 మెగావాట్ల ఉత్పత్తికి అణు విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ అనుమతి ఇచ్చింది. మరో వారం పదిరోజుల్లో ఉత్పత్తి మరింత పెంపునకు అనుమతి ఇవ్వడం తథ్యమని తెలుస్తోంది. తొలి యూనిట్ ద్వారా పూర్తిస్థాయిలో వెయ్యి మెగావాట్లు మరో నెల రోజుల్లో ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రెండో యూనిట్‌లో ఉత్పత్తికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి అయిన పక్షంలో 1025 మెగావాట్లు రాష్ట్రానికి, 266 మెగావాట్లు కేరళకు, 442 మెగావాట్లు కర్ణాటకకు, 67 మెగావాట్లు పుదుచ్చేరికి అందించనున్నారు.
అంతా నాటకం
విద్యుత్ ఉత్పత్తి ఆరంభమైందన్న అధికారుల ప్రకటనను నాటకమంటూ ఉద్యమకారులు కొట్టిపారేశారు. ఉద్యమనేత ఉదయకుమార్ మీడియాతో మాట్లాడుతూ రష్యా ప్రధానిని మెప్పించేందుకు ఈ నాటకం సాగుతోందని ఆరోపించారు. మూడు, నాలుగో యూనిట్ ఒప్పందాల్లోని న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు, నష్ట పరిహారం చెల్లింపును దృష్టిలో ఉంచుకునే ఆగమేఘాలపై ఉత్పత్తి ఆరంభమైనట్లు ప్రకటించుకున్నారని పేర్కొన్నారు. రష్యా ప్రధానిని మోసం చేయడం లక్ష్యంగా ఉత్పత్తి ప్రకటన వెలువడిందని ఆరోపించారు.
అనుమానం
కూడంకులంలో అణు విద్యుత్ ఉత్పత్తికి నిజంగానే శ్రీకారం చుట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రయల్ రన్‌లో టర్బైన్ పనిచేస్తున్న సమయంలో ఆ కేంద్రం నుంచి పెద్ద శబ్దం వచ్చేది. అలాగే అక్కడి గొట్టాల నుంచి తెల్లరంగుతో ఉబరి నీరు, పొగ వెలువడేది. అయితే మంగళవారం తమకు శబ్దం వినబడలేదని, పొగ కనిపించలేదని పరిసర వాసులు పేర్కొన్నారు. ట్రయల్ రన్ వేరు, అధికారిక ఉత్పత్తి వేరని అణు కేంద్రం వర్గాలు పేర్కొంటున్నాయి.
అణు విద్యుత్ ఉత్పత్తి ఆరంభమైంది.
Published Wed, Oct 23 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement