లాల్‌బాగ్‌చా రాజాకు రూ.51 కోట్ల బీమా
Published Thu, Sep 5 2013 11:31 PM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
సాక్షి, ముంబై: కోరిన భక్తులకు కొంగు బంగారంగా, విఘ్నాలు తీర్చే విఘ్నేశ్వరుడిగా ప్రఖ్యాతి చెందిన ‘లాల్‌బాగ్ చా రాజా’కు రూ.51 కోట్లు బీమా పాలసీ తీసుకున్నారు. ఉత్సవాల సమయంలో ఉగ్రవాదుల దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి తదితర విపత్తులకు రూ.15 కోట్ల పాలసీ తీసుకున్నట్లు లాల్‌బాగ్ చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి అధ్యక్షుడు అశోక్ పవార్ చెప్పారు. ఏటా లాల్‌బాగ్ చా రాజాను దర్శించుకునేందుకు నగరంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల్లో జనం తరలివస్తారు.
ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. మొక్కుబడులు చెల్లించుకునేవారికి దాదాపు 20-24 గంటలకుపైనే సమయం పడుతుంది. దూరం నుంచి దర్శించుకునేందుకు కనీసం ఆరు గంటలకుపైనే సమయం పడుతుంది. ఈ ఏడాది భక్తుల సంఖ్య దాదాపు కోటి వరకు ఉండగలదని మండలి అంచనావేసింది. ఉత్సవాలు ప్రారంభించేందుకు దాదాపు 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని పవార్ తెలిపారు. మొక్కుబడులు తీర్చుకునేవారికి, విగ్రహాన్ని దూరం నుంచి దర్శనం చేసుకునే వారికి వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేశామన్నారు. అనంత చతుర్ధశికి ఒకరోజు ముందు అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లను నిలిపివేస్తారు. క్యూలో ఉన్నవారికి ఉదయం వరకు దర్శన భాగ్యం కల్పించి ఆ తరువాత విగ్రహాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు. దర్శనానికి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు 250 చోట్ల మార్గదర్శన సూచికలను ఏర్పాటు చేశారు.
ఉపవాసాలతో గంటల తరబడి క్యూలో నిలబడ్డ భక్తులు కళ్లు తిరిగి పడిపోవడం, ఇతర అనారోగ్యానికి గురైతే వారికి వెంటనే వైద్యం అందించేందుకు కేం ఆస్పత్రికి చెందిన వైద్య బృందం, అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. నాలుగు సహాయక కేంద్రాలు, రద్దీని అదుపుచేసేందుకు వేయి మంది పోలీసులతో పాటు, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్, 200 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు, మూడు వేల మందికిపైగా లాల్‌బాగ్ చా రాజా మండలి కార్యకర్తలు అందుబాటులో ఉంటారని పవార్ అన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా మండపం పరిసరాల్లో 100 సీసీ కెమెరాలు, 50 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 35 గేట్ మెటల్ డిటెక్టర్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement