Lalbaugcha Raja
-
ఈ గణేశుడికి రూ.5.65 కోట్ల ఆదాయం.. ఘనంగా వెండి, బంగారం
ప్రసిద్ధ ముంబై లాల్బాగ్చా గణేశుడికి ఈ ఏడాది ఉత్సవాల్లో భక్తుల నుండి కానుకల రూపంలో భారీగా ఆదాయం వచ్చింది. పది రోజులలో రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64.32 కిలోల వెండి వస్తువులను భక్తులు సమర్పించారు.గణేశ్ చతుర్థి ఉత్సవాలు ముగియడంతో గణపతి బప్పాకు వీడ్కోలు పలుకుతూ లాల్బాగ్చా రాజాకు పది రోజులలో వచ్చిన కానుకలను వేలం వేశారు. లాల్బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ వారు ప్రతి సంవత్సరం భక్తుల నుంచి వచ్చిన బంగారం, వెండిని బహిరంగ వేలం ద్వారా భక్తులకే అందిస్తారు. భక్తులు వీటిని ఆ లంబోదరుడి ప్రసాదంగా భావించి వేలంపాటలో దక్కించుకుంటారు.ఈ ఏడాది లాల్బాగ్చా రాజాకు రూ. 5,65,90,000 నగదుతో పాటు 4,151 గ్రాముల బంగారం, 64,321 గ్రాముల వెండి భక్తుల నుంచి వచ్చాయి. ఆనవాయితీ ప్రకారం గణేశోత్సవ్ మండల్ వారు అన్ని వస్తువులను వేలం వేశారు. లాల్బాగ్చా రాజాకు వచ్చిన అన్ని ఆభరణాలలో 990.600 గ్రాముల బంగారు గొలుసును వేలం వేయగా రూ. 69.31 లక్షలు పలికింది. -
Lalbaugcha Raja: లాల్బాగ్ గణపతి ప్రత్యేకతలివే..
ముంబై: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలో 10 రోజుల పాటు ఘనంగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడి లాల్బాగ్చా రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. లాల్‌బాగ్‌లో పూజలు అందుకునే వినాయకుణ్ణి చూసేందుకు మనదేశం నుంచే కాదు ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.సెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుడిని లాల్బాగ్చా రాజా అని పిలుస్తుంటారు. ఉత్సవాల సమయంలో లాల్ బాగ్ ప్రాంతమంతా భక్తులతో కళకళలాడుతుంటుంది. గణేశుని దర్శనం కోసం భక్తులు క్యూ కడుతుంటారు. ఇక్కడి వేదికపై ప్రతిష్ఠించిన విఘ్నహర్త గణేశుడి విగ్రహాన్ని నవశాచ గణపతి అంటారు. ఈ రూపం భక్తుల సమస్త కోరికలను తీరుస్తుందని చెబుతుంటారు.లాల్‌బాగ్‌లో నిర్వహించే 10 రోజుల గణేశ ఉత్సవంలో ప్రతిరోజూ లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలి వస్తుంటారు. ఈ 20 అడుగుల ఎత్తయిన విఘ్నహర్త విగ్రహాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 89 ఏళ్లుగా ఈ అందమైన బప్పా విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కాంబ్లీ కుటుంబం పర్యవేక్షిస్తోంది.కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు ఇక్కడి గణపతి బప్పాను దర్శించుకుని, ఆశీస్సులు పొందుతారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు కూడా లాల్బాగ్చా రాజా ఆశీర్వాదం కోసం ఇక్కడికి వస్తారు. -
లాల్‌బాగ్చాకు అనంత్ అంబానీ స్వర్ణకిరీటం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్బాగ్చా రాజా వినాయకుడికి రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి భారీ విరాళం అందజేశారు. రూ.15 కోట్ల విలువైన 20 కిలోల స్వర్ణ కిరీటాన్ని తన ఆరాధ్య దైవానికి సమరి్పంచారు. లాల్బాగ్చా రాజా భారీ విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత వస్తున్న తొలి వినాయక చవితి కావడంతో స్వర్ణ కిరీటాన్ని తన ఇష్ట దైవానికి అందించినట్లు తెలుస్తోంది. -
ముంబైలో లాల్బగ్చా గణేశ్ ఉత్సవాలు రద్దు
ముంబై: దేశంలో కరోనా ధాటికి అతలాకుతలమవుతున్న నగరాల్లో ముంబై ముందు స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వినాయక ఉత్సవాలు నిర్వహించకూడదని ముంబైలోని ప్రముఖ లాల్బగ్చా రాజ సార్వజనిక్ గణేషోత్సవ మండలి నిర్ణయించింది. వైరస్ విజృంభణ వల్ల వినాయక చతుర్థి వేడుకలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకు బదులుగా కోవిడ్‌తో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ఉత్సవ మండలి సెక్రటరీ సుధీర్ సాల్వీ మీడియాకు తెలిపారు. దీంతోపాటు వైరస్ బారిన పడిన రోగుల కోసం రక్తదానం, ప్లాస్మా దానం క్యాంపులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. (‘వినాయక’ విడుదల ఎప్పుడు?) కాగా 1934 నుంచి లాల్బగ్చా మండలి క్రమం తప్పకుండా గణేశుడిని ప్రతిష్టిస్తూ వేడుకలు నిర్వహిస్తోంది. కానీ ఈ యేడాది ఉపద్రవంలా వచ్చిపడ్డ కరోనా మహమ్మారి వల్ల విగ్రహ ప్రతిష్టతో సహా ఎలాంటి వేడుకలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చూడా ఈసారి గణేశుడి ప్రతిమలు నాలుగు అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వినాయక చతుర్థి వేడుకలు సాదాసీదాగా జరుపుకోవాలని, పందిళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. (ముంబైకి మరో ముప్పు) -
గణనాథుడికి భక్తులు షాక్
సాక్షి, ముంబై : భక్తులు ఏకంగా గణనాథుడినే బురిడీ కొట్టించారు. ఎంతో ఇష్టమైన లాల్బాగ్చా రాజా గణనాథుడికి భక్తులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తారు. ఈసారి కూడా బంగారు, వెండి, నగదు రూపంలో కాసుల వర్షం కురిపించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన హుండీ తెరిచి భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కిస్తుండగా బురిడీనాథుల సంగతి బయటపడింది. భగవంతుడికి ఏదో కానుక సమర్పించుకోవాలి కాబట్టి... దొరికిందే సందు అనుకుని కొందరు రద్దయిన నోట్లను కానుకలుగా సమర్పించిన వైనం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు... కానుకలు లెక్కిస్తుంటే ఏకంగా 1.10 లక్షల రూపాయల రద్దయిన పాత పెద్ద నోట్లను చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను సమర్పించగా వీటి విలువ 1.10 లక్షల రూపాయలు ఉన్నట్లు లాల్బాగ్చా రాజా మండలి నిర్వాహకులు తెలిపారు. మండలికి చెందిన వాలెంటీర్లు శుక్రవారం స్వామి పాదాల వద్ద జమ అయిన నగదును లెక్కిస్తుండగా ఈ నోట్లను గుర్తించారు. ప్రస్తుతం ఆ నోట్లను ఏం చేయాలో తెలియక మండలి నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నోట్లు పేపరు ముక్కతో సమానం. అయితే ఇలాంటి నోట్లను కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. రద్దయిన నోట్లను కలిగి ఉండడం నేరమని గత ఏడాది కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ డబ్బులు డిపాజిట్ చేసేందుకు ప్రయత్నిస్తామని గణేష్ మండలి అధ్యక్షుడు బాలాసాహెబ్ కాంబ్లే తెలిపారు. ఇకపోతే, గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది రాజాకు భక్తులు తక్కువగా సమర్పించుకున్నారు. గత ఏడాది రూ.6.6 కోట్లు భక్తులు సమర్పించగా ఈ ఏడాది రూ.5.9 కోట్లు మాత్రమే వచ్చాయి. లాల్బాగ్చా రాజాకు వచ్చిన కానుకలు... బంగారుతో తయారు చేసిన లక్ష్మి దేవి, గణేష్ విగ్రహాలు ఉన్నాయి. వీటి విలువ రూ.31.5 లక్షలు ఉండగా ఒకో విగ్రహం 500 గ్రాముల వరకు ఉంటుంది. అదేవిధంగా 262 గ్రాముల ఓ బంగారు నెక్లెస్, ఒక కిలో బంగారు ఇటుకను గణేషుడికి భక్తులు సమర్పించారు. వీటి మొత్తం విలువ రూ.1.70 కోట్లు ఉండగా బంగారం 5.5 కేజీల వరకు ఉంటుంది. అదేవిధంగా రూ.40 లక్షల విలువజేసే వెండిని కూడా స్వామి వారికి సమర్పించారు. అయితే ఈ సారి ఎలాంటి వాహనాలను రాజాకు సమర్పించలేదు. లాల్బాగ్చా రాజా సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ బంగారు, వెండి ఆభరణాలను వేలంపాట వేయనునన్నారు. గత ఏడాది ఈ తతంగం ఒక్క రోజులోనే ముగిసిందన్నారు. మండలి కోశాధికారి మహేష్ జాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేలం పాటలో వచ్చిన డబ్బును సామాజిక, సంక్షేమ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తామన్నారు. -
గణేష్ ఉత్సవాలకు హాజరైన సచిన్ కుటుంబం
-
‘లాల్బాగ్ చా రాజా’కు కాసుల వర్షం
సాక్షి, ముంబై: ‘లాల్బాగ్ చా రాజా’ కు కాసుల వర్షం కురిసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పించారు. నగదు రూపంలో రూ.6.77 కోట్లు వచ్చాయని లాల్బాగ్ చా రాజా మండలి అధ్యక్షుడు అశోక్ పవార్ చెప్పారు. వెండి, బంగారు కానుకలు భారీగానే వచ్చాయని తెలిపారు. వీటిని ప్రతిరోజూ సాయంత్రం ఐదు నుంచి రాత్రి 10 గంటల వరకు రాజా మండపం ఆవరణలో బహిరంగంగా వేలం వేస్తున్నామని వివరించారు. ఈ వేలం నిర్వహణ శుక్రవారం వరకు ఉంటుందని తెలిపారు. ‘వినాయక చవితి ఉత్సవాల సమయంలో భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన రాజాను దర్శించుకోవాలంటే కనీసం 20 నుంచి 25 గంటల సమయం తీసుకుంటుంది. ఇందుకోసం ఎంతో ఓపిగ్గా క్యూలో నిలబడాల్సి ఉంటుంది. అయినా ఎంతో భక్తిశ్రద్ధలతో 10 రోజుల పాటు రాజాను లక్షల్లో వచ్చిన జనం దర్శించుకున్నార’ని ఆయన చెప్పారు. రాజాను గత బుధవారం ఉదయం నిమజ్జనానికి తరలించినప్పటికీ అంతకుముందు రోజు నుంచే నగదు లెక్కింపు ప్రారంభించామన్నారు. లాల్బాగ్ చా రాజా మండలి ఆవరణలో ఏర్పాటుచేసిన ఆరు హుండీల్లో పోగైన నగదును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన 20 మంది సిబ్బంది ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లెక్కించారని పేర్కొన్నారు. రూ.6.77 కోట్లు నగదు వచ్చినట్టు తేలిందన్నారు. ఇందులో దేశ కరెన్సీతో పాటు విదేశీ డాలర్లు కూడా ఉన్నాయని చెప్నారు. ‘వస్తురూపంలో చెల్లించుకున్న కానుకల్లో బంగారు, వెండి ఆభరణాలు, బిస్కెట్లు, గణేశ్ విగ్రహాలు, మూషికాలు, ఉంగరాలు, కిరీటాలు, రుద్రాక్ష మాలలు, బంగారు గొలుసులు, బ్రాస్లెట్లు, మోదక్‌లు, త్రిశూలాలు, వజ్రాలతో కూడిన వాచీలు తదితర వస్తువులు ఉన్నాయి. ఇందులో దాదాపు 11 కేజీల బంగారు, 200 కేజీల వెండి వస్తువులు ఉన్నాయ’ని పవార్ వెల్లడించారు. -
లాల్బాగ్ పరిసరాలు ప్రశాంతం
సాక్షి, ముంబై: లాల్బాగ్ పరిసర ప్రాంతవాసులకు ఎట్టకేలకు ప్రశాంతత లభించింది. గణేశ్ ఉత్సవాల కారణంగా వివిధ రకాల శబ్దాలు తదితరాల కారణంగా పది రోజులపాటు నరకయాతన అనుభవించిన వీరికి గురువారం రాత్రి తుపాను వెలిసిన భావన కలిగింది. గణేశ్ మండళ్లవద్ద విరామం లేకుండా భారీగా లౌడ్ స్పీకర్లు, డీజేల సౌండ్లతో వారి చెవులు అదిరిపోయాయి. దీంతో వారికి పది రోజులుగా కంటిమీద కునుకు లేకుండాపోయింది. కనీసం మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొన్నామంటూ వారు వాపోయారు. అత్యధిక శాతం మండళ్లు తమ విగ్రహాలను బుధవారం సాయంత్రమే నిమజ్జనం చేయగా కొన్ని మండళ్లు గురువారం రాత్రి ఆ ప్రక్రియను పూర్తిచేశాయి. లాల్బాగ్ ప్రాంతంలో ‘లాల్బాగ్ చా రాజా’ తోపాటు అనేక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయి. దీంతో స్థానిక, శివారు ప్రాంత ప్రజలుసహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు గణేశ్ ఉత్సవాల సమయంలో లాల్బాగ్ ప్రాం తాన్ని తప్పకుండా సందర్శిస్తారు. ఈ కారణంగా ఈ ఉత్సవాల సమయంలో ఈ ప్రాంతం జనసంద్ర మవుతుంది. గణేశ్ ఉత్సవాలు భక్తులకు ఆనందం కలిగించినప్పటికీ స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ జనం రాకపోకల కారణంగా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసేదాకా కనీసం ద్విచక్ర వాహనం తమ ఇంటి ఛాయలకు తీసుకెళ్లలేని పరిస్థితి ఎదురైంది. ఇక కార్లు, ఇతర వాహన యజమానుల పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. ఎక్కడోదూరంగా ఖాళీ ప్రాంతంలో తమ వాహనాలను నిలిపి, నడుచుకుంటూ ఇంటికి చేరుకోక తప్పలేదు. ఎవరైనా బంధువులు ఇంటికి రావాలన్నా లేదా వీరు బయటకు వెళ్లాలన్నా కూడా ఇదే పరిస్థితి. కిరాణా, కూరగాయల లగేజీతో ఇంటికి రావాలంటే ఎక్కడో ట్యాక్సీ దిగి నడచుకుంటూ రావాల్సి వచ్చింది. ముఖ్యంగా లాల్బాగ్ చా రాజా మండపానికి ఆనుకున్న చాల్స్, భవనాల నివాసులకు గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా బంధులొస్తే ముందుగా ఫోన్ చేయాలి. ఫలానాచోట నిలబడ్డానని చెప్పాలి. ఆ తరువాత వీరు వచ్చి తీసుకెళితే తప్ప మండలి కార్యకర్తలు వారిని పంపించేవారు కాదు. ఇలా ఉత్సవాలు జరిగినన్ని రోజులు స్థానికులు అనేక సమస్యలతో సతమతమయ్యారు. -
లాల్బాగ్చా రాజాకు రూ.51 కోట్ల బీమా
సాక్షి, ముంబై: కోరిన భక్తులకు కొంగు బంగారంగా, విఘ్నాలు తీర్చే విఘ్నేశ్వరుడిగా ప్రఖ్యాతి చెందిన ‘లాల్బాగ్ చా రాజా’కు రూ.51 కోట్లు బీమా పాలసీ తీసుకున్నారు. ఉత్సవాల సమయంలో ఉగ్రవాదుల దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి తదితర విపత్తులకు రూ.15 కోట్ల పాలసీ తీసుకున్నట్లు లాల్బాగ్ చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి అధ్యక్షుడు అశోక్ పవార్ చెప్పారు. ఏటా లాల్బాగ్ చా రాజాను దర్శించుకునేందుకు నగరంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల్లో జనం తరలివస్తారు. ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. మొక్కుబడులు చెల్లించుకునేవారికి దాదాపు 20-24 గంటలకుపైనే సమయం పడుతుంది. దూరం నుంచి దర్శించుకునేందుకు కనీసం ఆరు గంటలకుపైనే సమయం పడుతుంది. ఈ ఏడాది భక్తుల సంఖ్య దాదాపు కోటి వరకు ఉండగలదని మండలి అంచనావేసింది. ఉత్సవాలు ప్రారంభించేందుకు దాదాపు 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని పవార్ తెలిపారు. మొక్కుబడులు తీర్చుకునేవారికి, విగ్రహాన్ని దూరం నుంచి దర్శనం చేసుకునే వారికి వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేశామన్నారు. అనంత చతుర్ధశికి ఒకరోజు ముందు అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లను నిలిపివేస్తారు. క్యూలో ఉన్నవారికి ఉదయం వరకు దర్శన భాగ్యం కల్పించి ఆ తరువాత విగ్రహాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు. దర్శనానికి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు 250 చోట్ల మార్గదర్శన సూచికలను ఏర్పాటు చేశారు. ఉపవాసాలతో గంటల తరబడి క్యూలో నిలబడ్డ భక్తులు కళ్లు తిరిగి పడిపోవడం, ఇతర అనారోగ్యానికి గురైతే వారికి వెంటనే వైద్యం అందించేందుకు కేం ఆస్పత్రికి చెందిన వైద్య బృందం, అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. నాలుగు సహాయక కేంద్రాలు, రద్దీని అదుపుచేసేందుకు వేయి మంది పోలీసులతో పాటు, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్, 200 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు, మూడు వేల మందికిపైగా లాల్బాగ్ చా రాజా మండలి కార్యకర్తలు అందుబాటులో ఉంటారని పవార్ అన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా మండపం పరిసరాల్లో 100 సీసీ కెమెరాలు, 50 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 35 గేట్ మెటల్ డిటెక్టర్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.