గణనాథుడికి భక్తులు షాక్ | devotees offers demonetized notes to Mumbai Lalbaugcha raja | Sakshi
Sakshi News home page

గణనాథుడికి భక్తులు షాక్

Published Sat, Sep 9 2017 7:23 PM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

గణనాథుడికి భక్తులు షాక్

గణనాథుడికి భక్తులు షాక్

సాక్షి, ముంబై : భక్తులు ఏకంగా గణనాథుడినే బురిడీ కొట్టించారు. ఎంతో ఇష్టమైన లాల్‌బాగ్‌చా రాజా గణనాథుడికి భక్తులు ప్రతి ఏటా పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తారు. ఈసారి కూడా బంగారు, వెండి, నగదు రూపంలో కాసుల వర్షం కురిపించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన హుండీ తెరిచి భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కిస్తుండగా బురిడీనాథుల సంగతి బయటపడింది. భగవంతుడికి ఏదో కానుక సమర్పించుకోవాలి కాబట్టి... దొరికిందే సందు అనుకుని కొందరు రద్దయిన నోట్లను కానుకలుగా సమర్పించిన వైనం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు... కానుకలు లెక్కిస్తుంటే ఏకంగా 1.10 లక్షల రూపాయల రద్దయిన పాత పెద్ద నోట్లను చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు.

రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను సమర్పించగా వీటి విలువ 1.10 లక్షల రూపాయలు ఉన్నట్లు లాల్‌బాగ్‌చా రాజా మండలి నిర్వాహకులు తెలిపారు. మండలికి చెందిన వాలెంటీర్లు శుక్రవారం స్వామి పాదాల వద్ద జమ అయిన నగదును లెక్కిస్తుండగా ఈ నోట్లను గుర్తించారు. ప్రస్తుతం ఆ నోట్లను ఏం చేయాలో తెలియక మండలి నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నోట్లు పేపరు ముక్కతో సమానం. అయితే ఇలాంటి నోట్లను కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. రద్దయిన నోట్లను కలిగి ఉండడం నేరమని గత ఏడాది కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే తాము రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు ప్రయత్నిస్తామని గణేష్‌ మండలి అధ్యక్షుడు బాలాసాహెబ్‌ కాంబ్లే తెలిపారు. ఇకపోతే, గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది రాజాకు భక్తులు తక్కువగా సమర్పించుకున్నారు. గత ఏడాది రూ.6.6 కోట్లు భక్తులు సమర్పించగా ఈ ఏడాది రూ.5.9 కోట్లు మాత్రమే వచ్చాయి.

లాల్‌బాగ్‌చా రాజాకు వచ్చిన కానుకలు...
బంగారుతో తయారు చేసిన లక్ష్మి దేవి, గణేష్‌ విగ్రహాలు ఉన్నాయి. వీటి విలువ రూ.31.5 లక్షలు ఉండగా ఒకో విగ్రహం 500 గ్రాముల వరకు ఉంటుంది. అదేవిధంగా 262 గ్రాముల ఓ బంగారు నెక్లెస్, ఒక కిలో బంగారు ఇటుకను గణేషుడికి భక్తులు సమర్పించారు. వీటి మొత్తం విలువ రూ.1.70 కోట్లు ఉండగా బంగారం 5.5 కేజీల వరకు ఉంటుంది.

అదేవిధంగా రూ.40 లక్షల విలువజేసే వెండిని కూడా స్వామి వారికి సమర్పించారు. అయితే ఈ సారి ఎలాంటి వాహనాలను రాజాకు సమర్పించలేదు. లాల్‌బాగ్‌చా రాజా సార్వజనిక్‌ గణేషోత్సవ్‌ మండల్‌ బంగారు, వెండి ఆభరణాలను వేలంపాట వేయనునన్నారు. గత ఏడాది ఈ తతంగం ఒక్క రోజులోనే ముగిసిందన్నారు. మండలి కోశాధికారి మహేష్‌ జాదవ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేలం పాటలో వచ్చిన డబ్బును సామాజిక, సంక్షేమ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement