సాక్షి, ముంబై: లాల్‌బాగ్ పరిసర ప్రాంతవాసులకు ఎట్టకేలకు ప్రశాంతత లభించింది. గణేశ్ ఉత్సవాల కారణంగా వివిధ రకాల శబ్దాలు తదితరాల కారణంగా పది రోజులపాటు నరకయాతన అనుభవించిన వీరికి గురువారం రాత్రి తుపాను వెలిసిన భావన కలిగింది. గణేశ్ మండళ్లవద్ద విరామం లేకుండా భారీగా లౌడ్ స్పీకర్లు, డీజేల సౌండ్‌లతో వారి చెవులు అదిరిపోయాయి. దీంతో వారికి పది రోజులుగా కంటిమీద కునుకు లేకుండాపోయింది. కనీసం మొబైల్ ఫోన్‌లో కూడా మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొన్నామంటూ వారు వాపోయారు. అత్యధిక శాతం మండళ్లు తమ విగ్రహాలను బుధవారం సాయంత్రమే నిమజ్జనం చేయగా కొన్ని మండళ్లు గురువారం రాత్రి ఆ ప్రక్రియను పూర్తిచేశాయి.
లాల్‌బాగ్ ప్రాంతంలో ‘లాల్‌బాగ్ చా రాజా’ తోపాటు అనేక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయి. దీంతో స్థానిక, శివారు ప్రాంత ప్రజలుసహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు గణేశ్ ఉత్సవాల సమయంలో లాల్‌బాగ్ ప్రాం తాన్ని తప్పకుండా సందర్శిస్తారు. ఈ కారణంగా ఈ ఉత్సవాల సమయంలో ఈ ప్రాంతం జనసంద్ర మవుతుంది. గణేశ్ ఉత్సవాలు భక్తులకు ఆనందం కలిగించినప్పటికీ స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ జనం రాకపోకల కారణంగా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసేదాకా కనీసం ద్విచక్ర వాహనం తమ ఇంటి ఛాయలకు తీసుకెళ్లలేని పరిస్థితి ఎదురైంది. ఇక కార్లు, ఇతర వాహన యజమానుల పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది.
ఎక్కడోదూరంగా ఖాళీ ప్రాంతంలో తమ వాహనాలను నిలిపి, నడుచుకుంటూ ఇంటికి చేరుకోక తప్పలేదు. ఎవరైనా బంధువులు ఇంటికి రావాలన్నా లేదా వీరు బయటకు వెళ్లాలన్నా కూడా ఇదే పరిస్థితి. కిరాణా, కూరగాయల లగేజీతో ఇంటికి రావాలంటే ఎక్కడో ట్యాక్సీ దిగి నడచుకుంటూ రావాల్సి వచ్చింది. ముఖ్యంగా లాల్‌బాగ్ చా రాజా మండపానికి ఆనుకున్న చాల్స్, భవనాల నివాసులకు గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా బంధులొస్తే ముందుగా ఫోన్ చేయాలి. ఫలానాచోట నిలబడ్డానని చెప్పాలి. ఆ తరువాత వీరు వచ్చి తీసుకెళితే తప్ప మండలి కార్యకర్తలు వారిని పంపించేవారు కాదు. ఇలా ఉత్సవాలు జరిగినన్ని రోజులు స్థానికులు అనేక సమస్యలతో సతమతమయ్యారు.
లాల్‌బాగ్ పరిసరాలు ప్రశాంతం
Published Sat, Sep 21 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement