సయోధ్య..
‘లోకాయుక్త’పై చర్చకు ఒకరోజు సమయం
స్పీకర్ హామీతో శాంతించిన విపక్షాలు
నిరసన ఉపసంహరణ సజావుగా సభా కార్యక్రమాలు
బెంగళూరు: ఎట్టకేలకు విపక్షాలు శాంతించాయి. దీంతో రాష్ట్ర చట్టసభల్లో కార్యక్రమాలు మంగళవారం సజావుగా సాగాయి. లోకాయుక్తను నిర్వీర్యం చేయడానికే అవినీతి నిరోధక దళం పేరుతో కొత్త వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెబుతూ భారతీయ జనతా పార్టీతో పాటు జేడీఎస్ సభ్యులు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. ఈ సమయంలో కలుగజేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీబీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోదని స్పష్టం చేశారు. దీంతో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని స్పీకర్ అధికార, విపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను తన కార్యాలయంలోకి పిలిపించి వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. ప్రజలు తాగు, సాగునీటి కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పై చర్చించాలని సూచించారు. అదే సందర్భంలో లోకాయుక్త నిర్వీర్యం కాకుండా సంస్థ మరింత బలోపేతం కావడానికి చర్యలు చేపట్టే విషయమై చట్ట సభలో చర్చ జరపాలని ఇందుకు ఒక రోజు మొత్తాన్ని కేటాయిస్తానని తెలిపారు.
ఇందుకు అధికార పక్షం సభ్యులతో పాటు విపక్షాలు కూడా అంగీకరించాయి. ఇదే విషయాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప శాసనసభలో ప్రకటించారు. దీంతో అప్పటి వరకూ నిరసనకు దిగిన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌తో పాటు ఇతర విపక్ష సభ్యులు ‘విలువైన సభా సమయంలో ప్రజా సమస్యలపై చర్చించాలని భావిస్తూ నిరసనను వెనక్కు తీసుకుంటున్నాం. అయితే లోకాయుక్తను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆందోళనకు దిగుతాం.’ అని పేర్కొంటూ విపక్ష సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కుర్చొండి పోయారు. దీంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగాయి.