ఆగని ఆందోళనలు | llc workers Strike Notice Worker shot dead | Sakshi
Sakshi News home page

ఆగని ఆందోళనలు

Published Wed, Mar 19 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

llc workers Strike Notice Worker shot dead

 సాక్షి, చెన్నై:  ఎన్‌ఎల్‌సీ కార్మికులు మరో మారు సమ్మె నోటీస్ ఇచ్చారు. కార్మికుడి కాల్చివేత ఘటనను కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. మంగళవారం ఆందోళనలతో నైవేలి అట్టుడికింది. బంద్ వాతావరణం నెలకొనడంతో జన  జీవనం స్తంభించింది. ఉద్యోగుల హెచ్చరికలతో లిగ్నైట్ కార్పొరేషన్ యాజమాన్యం దిగి వచ్చింది. తమ డిమాండ్లకు యాజమాన్యం ఏ మేరకు తలొగ్గుతుందో దాని ఆధారంగా తదుపరి తమ నిర్ణయం ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కడలూరు జిల్లా నైవేలిలోని కేంద్ర ప్రభుత్వ లిగ్నైట్ కార్పొరేషన్‌లో వివాదం రాజుకుంది. కాంట్రాక్టు కార్మికుడు రాజా అలియాస్ రాజశేఖర్‌ను సీఐఎస్‌ఎఫ్ జవాన్ కాల్చి చంపడంతో ఆ పరిసరాలు సోమవారం రణరంగాన్ని తలపించాయి. ఈ ఘటనను కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ఇప్పటికే తమ మీద పలు మార్లు ప్రతాపం చూపించిన సీఐఎస్‌ఎఫ్‌ను వెనక్కు పంపించాలన్న డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతం చేయడానికి నిర్ణయించారు. మంగళవారం ఇంజనీర్లు మినహా తక్కిన కార్మికులందరూ విధులు బహిష్కరించారు. 
 
 సీఐటీయూ, ఏఐటీయూసీ, జీవా కాంట్రాక్టు కార్మికులు, తోముసా, పీఎంకే అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలో పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. ధర్నాలు, రాస్తారోకోలతో నైవేలి అట్టుడికింది. దుకాణాలన్నీ మూతబడ్డాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బంద్‌ను తలపించే రీతిలో నైవేలి నిర్మానుష్యంగా మారింది. సోమవారం అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు సీఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్‌పై దాడి చేసి, అక్కడి వస్తువులు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ పరిసరాల్లో భారీ బలగాల్ని మోహరింప చేశారు. డీఐజీ మురుగేషన్, ఎస్పీ రాాధిక అక్కడే తిష్ట వేసి పరిస్థితిని సమీక్షించారు. అలాగే ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేశాయి. చెన్నైలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టి.పాండియన్ నేతృత్వంలో సైదాపేటలో ఆందోళన చేశారు. అయితే, కార్మిక సంఘాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. 
 
 కార్మికుడిని సీఐఎస్‌ఎఫ్ హతమార్చినా, యాజమాన్యం నోరుమెదపక పోవడాన్ని తీవ్రంగా పరిగణించాయి. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎండగట్టే రీతిలో సమ్మె నోటీసు జారీ చేశారుు. దీంతో యాజమాన్యం ఉలిక్కి పడింది. ఇది వరకు సాగిన సమ్మె ప్రభావం నుంచి తేలుకోని యాజమాన్యం మళ్లీ సమ్మె బాటలో కార్మికులు పయనించకుండా ముందు జాగ్రత్తల్లో పడింది.చర్చలు : ఎన్‌ఎల్‌సీ ఉన్నతాధికారులు కార్మిక సంఘాలతో మధ్యాహ్నం చర్చలు చేపట్టారు. అయితే, కొన్ని డిమాండ్లను యాజమాన్యం ముందు కార్మిక సంఘాలు ఉంచాయి.  కార్మికుల డిమాండ్ల మంగళవారం రాత్రి  ఎన్‌ఎల్‌సీ దిగి వచ్చింది. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. అంత్యక్రియల నిమిత్తం రూ.50 వేలు మంజూరు చేసింది. 
 
 మృతుడి భార్యకు పర్మినెంట్‌గా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు తమ సానుభూతిని రాజా కుటుంబానికి తెలియజేశారు. అదే సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ను వెనక్కు తీసుకునే విషయమై ఎలాంటి హామీని ఎన్‌ఎల్‌సీ ఇవ్వలేదు. అయితే, కొన్ని చోట్ల ఉత్తరాదివారిని కాకుండా,  తమిళనాడుకు చెందిన సిబ్బందిని భద్రతా విధుల్లో దించే రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చర్చలు సత్ఫలితాన్ని ఇవ్వడంతో కార్మిక సంఘాలు తదుపరి కార్యాచరణకు సమావేశం అయ్యారు. ఈ సమావేశానంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అన్ని సంఘాలు ఏకాభిప్రాయానికి వచ్చిన పక్షంలో అర్ధరాత్రి నుంచి విధులకు వెళతామని, లేని పక్షంలో బుధవారం ఉదయం విధులకు హాజరు అవుతామని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. ఏకాభిప్రాయం కుదరని పక్షంలో అని విలేకరులు ప్రశ్నించగా బుధవారం ఉదయాన్నే ప్రకటిస్తామన్నారు. 
 
 హత్యకేసు...అరెస్టు: రాజాను కల్చి చంపడాన్ని పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. రాజాను తుపాకీతో కాల్చిన సీఐఎస్‌ఎఫ్ జవాన్‌ను అతి కష్టం మీద గుర్తించారు. జవాన్ నోమన్‌ను అరెస్టు చేసి కడలూరు కోర్టులో హాజరు పరిచారు. అతడిని ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అతడిని కడలూరు జైలుకు తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ నేతృత్వంలో ఆ పార్టీనాయకులు పెద్ద ఎత్తున నైవేలికి చేరుకుని లాఠీ చార్జ్‌లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. రాజాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరు చంటి బిడ్డ. భర్తను కోల్పోయిన వేదనలో ఆస్పత్రి ఆవరణలో ఆమె విలపిస్తుండడం కార్మికులను కంట తడి పెట్టించింది. రాజా కుటుంబాన్ని ఓదార్చారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement