టీ.నగర్: తమను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట మంత్రిపై ఫిర్యాదు చేసింది. దీనిపై హోసూరు డీఎస్పీ శుక్రవారం విచారణ జరిపారు. వివరాలు.. హోసూరు సమీపం దాసరపల్లి గ్రామానికి చెందిన రైతు మునిరెడ్డి కుమార్తె పవిత్ర (23). బీకాం చదివిన ఈమె ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన పిల్లప్పా కుమారుడు ఆనంద్ (29) హోసూరులో కూరగాయల మండి నడుపుతున్నాడు. పవిత్ర, ఆనంద్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో వారి ప్రేమకు పవిత్ర తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఇంటి నుంచి పరారైన ప్రేమజంట గత నెల 31న సూళగిరిలోని తిమ్మరాయప్పన్ గుడిలో వివాహం చేసుకున్నారు.
వారానికి పైగా కుటుంబం నడిపిన వీరు ప్రస్తుతం తెలుగులో మాట్లాడిన వీడియో ఫేస్‌బుక్‌లో విడుదల చేశారు. తాము రెండేళ్లుగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నామని వధువు పవిత్ర బంధువులు, అదే వర్గానికి చెందిన మంత్రి బాలకృష్ణారెడ్డి తమను బెదిరిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల ద్వారా బెదిరిస్తుండడంతో తమకు ఆత్మహత్య చేసుకోవాలన్న విరక్తిలో ఉన్నట్లు వారు తెలిపారు. తమకు భధ్రత కల్పించాలని కోరుతూ కృష్ణగిరి, ధర్మపురి ఎస్పీ కార్యాలయాలను ఆశ్రయించారు. హోసూరు డీఎస్పీ కార్యాలయానికి శుక్రవారం వెళ్లిన ప్రేమజంట వద్ద డీఎస్పీ మీనాక్షి విచారణ జరిపారు. దీనిపై మీనాక్షి మాట్లాడుతూ తన కుమార్తె కనిపించలేదని పవిత్ర తండ్రి బాగలూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రేమజంట వద్ద విచారణ జరిపామని, మంత్రి ఉత్తర్వులతో ప్రేమజంటను బెదిరించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment