సాక్షి బెంగళూరు: ఒక వాట్సాప్ మెసేజ్, అందులో పంపిన ఫొటోలు ఒక పెళ్లినే నిలిపేశాయి. ప్రియుడు, ప్రియురాలిని కలిపి దాంపత్య జీవితానికి బాటలు వేశాయి. ఈ ఘటన హాసన్ జిల్లా సకలేశపుర పట్టణంలో జరిగింది. సకలేశపురకు చెందిన శృతి, తారేశ్‌లకు ఇరు కుటంబాల పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. బుధవారం సాయంత్రం సంప్రదాయం ప్రకారం చేయాల్సిన పెళ్లి తంతు, ముందస్తు ఏర్పాట్లు అన్ని చేశారు. గురువారం ఉదయం పెళ్లి ముహూర్తం ఉందనగా తెల్లవారుజామున తారేశ్ మొబైల్‌కు మూడు ఫోటోలు వాట్సాప్ ద్వారా వచ్చాయి.
ఆ ఫోటోల్లో శ్రుతి వేరే వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో వరుడి కుటుంబం పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పెళ్లి మండపంలో గందరగోళం నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట నడిచింది. ఇదే సమయంలో ఫొటోలు పంపించిన, ఆ ఫొటోల్లోని వ్యక్తి అభిలాష్ పెళ్లి మంటపానికి వచ్చాడు. తాను, శ్రుతి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నామని, పెళ్లి ఎలా ఆపాలో తెలియక ఫొటోలు పంపించానని చెప్పుకొచ్చాడు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న సకలేశపురా పోలీసులు మంటపానికి వచ్చి యువతి శ్రుతిని పిలిచి వివరాలు అడగగా తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. దీంతో ఆమె అంగీకారం మేరకు అభిలాష్‌తో పెళ్లి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment