ఎల్‌ఆర్. ఈశ్వరికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల’ లాంటి హుషారెత్తించే పాటలతో ఏడో దశకంలో యువత మతి పోగొట్టిన గాయని ఎల్‌ఆర్. ఈశ్వరి శనివారం ఇక్కడ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నలుగురు ఈ గౌరవ పురస్కారాలను స్వీకరించారు.
అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్, న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హెచ్‌టీ. సాంగ్లియానా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. నాటక రంగంలో 12 నంది అవార్డులు అందుకున్న విజయవాడకు చెందిన పీవీఎన్. కృష్ణ, కర్ణాటక సంగీతంతో పాటు రచనా వ్యాసంగంలోని శ్రీకాకుళానికి చెందిన వీఆర్‌ఎల్. రాజేశ్వరి, మరణానంతరం దేహదానంపై సమాజంలో అవగాహన కల్పిస్తూ ఇప్పటి వరకు పది వేల దేహ దానాలు చేయించిన పశ్చిమ గోదావరి జి ల్లాకు చెందిన గూడూరు సీతా మహాలక్ష్మి, ఖమ్మం జిల్లాకు చెందిన సమాజ సేవకుడు డాక్టర్ శ్రీనివాస్‌లు డాక్టరేట్లను అందుకున్నారు.
ఈ సందర్భంగా సాంగ్లియానా ప్రసంగిస్తూ సమాజ సేవలో నిమగ్నమైన అనేక మందికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిశగా అకాడ మీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్, న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలు సాగిస్తున్న కృషిని అభినందించారు.