Academy of Universal Global Peace
-
మ్యూజికాలజిస్ట్ రాజాకు డాక్టరేట్
హైదరాబాద్ : తెలుగు సినీ సంగీతానికి వ్యాసాల ద్వారా, రివ్యూ ల ద్వారా తన పరిశోధనలను, విశ్లేషణలను అందించడమే కాకుండా, తన వద్ద గల సమాచారంతో సినీ ప్రముఖులకు కూడా సేవలను అందిస్తున్న మ్యూజికాలజిస్ట్ రాజాకు గౌరవ డాక్టరేట్ లభించింది. అంతర్జాతీయంగా 77 దేశాలలో గుర్తింపు కలిగిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఈ నెల 25న బెంగళూరులో ఆయనకు ఈ డాక్టరేట్‌ని అందజేసింది. హైదరాబాద్‌కు చెందిన రాజా నలభై ఏళ్లుగా సినిమా పాటలపై పరిశోధనలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషలకు చెందిన నలభై వేలకు పైగా పాటల సమాచారాన్ని వెలికితీశారు. తన పరిశోధనకు సంబంధించిన పాటలను రాజా మ్యూజిక్ బ్యాంక్.కామ్ (rajamusicbank.com) వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. -
డాక్టర్ నరేశ్!
సీనియర్ నటుడు నరేశ్ డాక్టరయ్యారు. న్యూయార్క్ కు చెందిన ‘అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్’ అనే సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ‘డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్’ అవార్డు అందుకున్న నరేశ్ మాట్లాడుతూ- ‘‘దక్షిణాదిన నాకు, కర్ణాటకకు చెందిన ఓ భరతనాట్య కళాకారిణికి డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఇటీవల తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా ‘నవరసరాయ’ బిరుదు అందుకున్నా. నాకు నటన నేర్పిన గురువు జంధ్యాలగారు, విజయనిర్మలగారు, కృష్ణ గార్లకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ డాక్టరేట్‌ను అంకితం చేస్తున్నా’’ అన్నారు. త్వరలో విడుదల కానున్న సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘శ్రీశ్రీ’తో పాటు తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తున్నాననీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఓ చిత్రం చేయనున్నాననీ చెప్పారు. -
జంధ్యాలకు గౌరవ డాక్టరేట్!
రచయిత నుంచి దర్శకుడిగా ఎదిగి, సకుటుంబ వినోద చిత్రాలతో ఒక దశాబ్దిన్నర కాలం పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఘన సినీ చరిత్ర - జంధ్యాలది. రచన, దర్శకత్వాల ద్వారా కొన్ని తరాలు చెప్పుకొనే కామెడీతో వెండితెరను వెలిగించిన ఆయనకు తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది. మరణించిన 14 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆయనకు గౌరవ డాక్టరేట్ లభించింది. అమెరికాకు చెందిన అకాడెమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, యునెటైడ్ నేషన్ ఆర్గనైజేషన్‌కు అనుబంధమైన స్వస్త ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లు ఈ నవంబర్ 1న బెంగళూరులో ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. స్వర్గీయ జంధ్యాల తరఫున ఆయన సతీమణి అన్నపూర్ణ ఈ పత్రాన్ని స్వీకరించారు. మనిషి ఉండగానే అవసరం లేకపోతే మర్చిపోయే సినీ (మాయా) ప్రపంచంలో ఒక వ్యక్తి భౌతికంగా కనుమరుగైన ఇన్నేళ్ళకు ఇలాంటి గౌరవం దక్కడం నిజంగా విశేషమే! -
ఎల్ఆర్. ఈశ్వరికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల’ లాంటి హుషారెత్తించే పాటలతో ఏడో దశకంలో యువత మతి పోగొట్టిన గాయని ఎల్ఆర్. ఈశ్వరి శనివారం ఇక్కడ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నలుగురు ఈ గౌరవ పురస్కారాలను స్వీకరించారు. అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్, న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హెచ్‌టీ. సాంగ్లియానా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. నాటక రంగంలో 12 నంది అవార్డులు అందుకున్న విజయవాడకు చెందిన పీవీఎన్. కృష్ణ, కర్ణాటక సంగీతంతో పాటు రచనా వ్యాసంగంలోని శ్రీకాకుళానికి చెందిన వీఆర్ఎల్. రాజేశ్వరి, మరణానంతరం దేహదానంపై సమాజంలో అవగాహన కల్పిస్తూ ఇప్పటి వరకు పది వేల దేహ దానాలు చేయించిన పశ్చిమ గోదావరి జి ల్లాకు చెందిన గూడూరు సీతా మహాలక్ష్మి, ఖమ్మం జిల్లాకు చెందిన సమాజ సేవకుడు డాక్టర్ శ్రీనివాస్‌లు డాక్టరేట్లను అందుకున్నారు. ఈ సందర్భంగా సాంగ్లియానా ప్రసంగిస్తూ సమాజ సేవలో నిమగ్నమైన అనేక మందికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిశగా అకాడ మీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్, న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలు సాగిస్తున్న కృషిని అభినందించారు.