
వైరముత్తుకు హైకోర్టులో ఊరట
చెన్నై : న్యాయమూర్తులను అగౌరపరచారన్న ఆరోపణల కేసులో గీత రచయిత వైరముత్తుకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. దివంగత సీనియర్ న్యాయమూర్తి కైలాషం శత జయంతి కార్యక్రమం, ఆయన పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల కార్యక్రమం గత ఏడాది సెప్టెంబర్ 12వ తేదీన చెన్నైలో జరిగింది.
ఆ కార్యక్రమంలో అతిథగా పాల్గొన్న గీత రచయిత వైరముత్తు న్యాయమూర్తులను అవమానించే విధంగా పదవీ విరమణకు ఆరు నెలల ముందు న్యాయమూర్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ బోద్రా వైరముత్తుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఆర్.సుధాకర్, పీఎస్.ప్రకాశ్ సమక్షంలో విచారణకు వచ్చింది. వైరముత్తు తరపున సీనియర్ న్యాయవాది ఆర్.క్రిష్ణమూర్తి హాజరై వాదించారు. గురువారం మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చింది. వైరముత్తు తరపు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు బోద్రా పిటషన్‌ను కొట్టి వేస్తూ తీర్పును వెల్లడించారు.