
తంత్రగాళ్లకు చెక్
అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకొని మూఢనమ్మకాలను వారిపై రుద్దుతున్న ‘తంత్రగాళ్లకు’ ఇకపై ముకుతాడు పడనుంది.
సాక్షి, ముంబై: అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకొని మూఢనమ్మకాలను వారిపై రుద్దుతున్న ‘తంత్రగాళ్లకు’ ఇకపై ముకుతాడు పడనుంది. మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాడి, హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. నాగపూర్‌లో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ‘మూఢాచారాల వ్యతిరేక బిల్లు’ను శుక్రవారం ఆమోదించారు. ఈ బిల్లు ఎగువసభ అయిన విధాన మండలి ఆమోదం కూడా పొంది, చట్టంగా మారితే.. అటువంటి చట్టాన్ని తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించనుంది. స్పీకర్ ఓటింగ్ పద్ధతిలో సభ ఆమోదాన్ని కోరడంతో మెజారీ సభ్యులు ఆమెదిస్తున్నట్లు తెలిపారు.
ఫలించిన దభోల్కర్ కల...
మూఢాచారాలు, మంత్రతంత్రాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ కల ఈ బిల్లు ఆమోదంతో సాకరమైందనే అభిప్రాయాన్ని ఆయన అనూయాయులు వ్యక్తం చేస్తున్నారు. బిల్లు కోసం పోరాడినందుకే దభోల్కర్‌ను హత్య చేశారని, ఆయన బతికుంటే మరింత కఠినమైన చట్టం కోసం పోరాటం చేసేవారని అభిప్రాయపడ్డారు. బిల్లును అసెంబ్లీ ఆమోదించడంపై దభోల్కర్ కుమారుడు హమీద్ దభోల్కర్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌లు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, త్వరలో రూపుదిద్దుకోనున్న ఈ చట్టం సమర్థవంతంగా అమలైనప్పుడే తన తండ్రి కృషి ఫలిస్తుందన్నారు.
బీజేపీ, శివసేన అసంతృప్తి...
దేశంలోనే మూఢాచారాలకు వ్యతిరేకంగా తెస్తున్న బిల్లుపై నామమత్రమైనా చర్చ చేపట్టకుండా ఆమోదింపజేసుకున్నారని బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మెజార్టీ ఉందనే మొండివైఖరితోనే అధికారపక్షం ఏకపక్షంగా బిల్లును చర్చకు తావులేకుండా ఆమోదింపజేసుకుందని, చర్చ జరిగి ఉంటే బిల్లులో అవసరమైన మార్పులు, చేర్పులపై మరిన్ని అభిప్రాయాలు వ్యక్తమయ్యేవని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇక ఈ బిల్లు ఆమోదం పొందడంపై శివసేన కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్లును ఆమోదింపజేసుకునేముందు వార్కారీలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందన్నారు.
విధానమండలిలో సోమవారం....
దిగువసభ అయిన విధానసభ ఆమోదం పొందిన మూఢాచారాల వ్యతిరేక బిల్లు ఇక ఎగువ సభ అయిన విధాన మండలి ఆమోదం కోసం వెళ్లనుంది. సోమవారం ఈ బిల్లు విధాన మండలి ఆమోదానికి వెళ్లే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అక్కడ కూడా ఎటువంటి చర్చ లేకుండానే సంఖ్యాబలం ఆధారంగా బిల్లును ఆమోదింపజేసుకోవాలని సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రతిపక్ష బీజేపీ, శివసేను చర్చ జరపాలంటూ పట్టుబట్టే అవకాశముందని తెలిసింది.