పింప్రి, న్యూస్‌లైన్: సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. అన్ని మిత్రపక్షాలను ఒప్పించి ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేయడం తలకు మించిన భారం అవుతోందన్నారు. పుణేలో ‘పుణే ఇంటర్నేషనల్ సెంటర్’ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన‘రి ఇన్వెహేటింగ్ ఇండియా పర్స్‌పెక్టివ్ ఫాం ది స్టేట్’ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని సర్వేల ఆధారంగా తెలుస్తోందన్నారు. బహుభాషా విధానంతో దేశంలో పొత్తుల ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, ఇది దేశానికి మంచి కాదని అభిప్రాయపడ్డారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోవడంతో చిన్న చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని నడిపించడం కష్టమవుతుందన్న విషయం అందరికీ తెలుసన్నారు.
ఆయా ప్రాంతీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం తమ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలను కోరడం తెలిసిందేనన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ స్థానాలను కట్టబెట్టాలని, అప్పుడే దేశ ప్రజల ప్రయోజనానికి పూర్తి స్వేచ్ఛతో పని చేయగలుగుతాయని వ్యక్తం చేశారు. దేశంలో నీరు, విద్యుత్, భద్రత, తీవ్రవాదం సమస్యగా మారాయన్నారు. ఈ సమావేశంలోపీఐసీ అధ్యక్షుడు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాథ్ మాశేల్కర్, రి ఇన్వేహేటింగ్ ఇండియా రూపకర్త దిలీప్ పాడగావ్‌కర్ తదితరులు పాల్గొన్నారు.
విలాస్‌రావ్ సేవలు మరువలేనివి
మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ సేవలు మరువలేనివని సీఎం పృథ్వీరాజ్ చవాన్ కొనియాడారు. ఆయన మొదటి వర్ధంతిని పురస్కరించుకొని పుణేలోని బీఎంసీసీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ‘విలాస్‌రావ్ జ్ఞాపకాలు’ అనే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలాస్‌రావ్ జీవితాన్ని ప్రేరణగా తీసుకోవాలన్నారు. ఎక్కడో లాతూర్‌లో పుట్టి, పుణేలో స్థిరపడి రాష్ర్ట ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఎదిగారన్నారు.
ఈ క్రమంలో అందికీ అప్త మిత్రుడయ్యారన్నారు. ముంబైలో అతని పేరుమీద ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయాల్లో ఆయనకు శత్రువులున్నా, బయటి ప్రచారంలో మాత్రం అందరికీ మిత్రుడిగా ఉండేవారని గోపీనాథ్ ముండే అన్నారు. కార్యక్రమంలో సహకార మంత్రి హర్షవర్ధన్ పాటిల్, శాసన సభ్యులు వినాయక్ మేటే, ఉల్లాస్ పవార్, నగర మేయర్ వైశాలీ బన్కర్, గోపీనాథ్ ముండే పాల్గొన్నారు.
సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులే: సీఎం
Published Mon, Aug 26 2013 11:25 PM | Last Updated on Mon, Oct 8 2018 5:57 PM
Advertisement
Advertisement