
తాళినే ఉరితాడుగా ఆలిని..
- అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
చెన్నై: కలకాలం నీతో కలిసుంటానని చెప్పి ముడివేసిన తాళే ఆమె పాలిట ఉరితాడైంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపడానికి తాళినే ఆయుధంగా మలుచుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరంబలూరు జిల్లా శిరువాచూర్ కళ్‌వొట్టార్ వీధికి చెందిన సోలైముత్తు(40), జ్యోతి(35) దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
విదేశంలో పనిచేయడానికి వెళ్లిన సోలైముత్తు కొన్ని నెలల క్రితం సొంతూరికి వచ్చాడు. అప్పటి నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సోలైముత్తు ఆమెతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సోలైముత్తు ఇంటి తలుపులు మూసేసి భార్యపై దాడి చేశాడు. అనంతరం ఆమె నోట్లో వస్త్రం కుక్కి, తాళితో గొంతు బిగించి హత్య చేశాడు. పారిపోతున్న సోలైముత్తును చూసి అనుమానించిన చుట్టుపక్కల వారు పట్టుకుని పెరంబలూర్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు జ్యోతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పెరంబలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.