ముంబై: మహరాష్ట్రలో భాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మరాఠీ సాహిత్యకారుడు వి.వి.షిర్వాద్కర్, అలియాస్ కుసుమగరాజ్ జయంతి సందర్భంగా జరిపే మహరాష్ట్ర భాషా దివస్ ను పురస్కరించుకొని పలు సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా షిర్వాద్కర్ స్వంత గ్రామం నాసిక్ లో కుసుమగరాజ్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది.
భాషా దినోత్సవం సందర్భంగా మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని సుమారు 568 బస్ స్టేషన్ల నుంచి 18,000 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి బస్సుకు కుసుమగరాజ్ సహా.. పలువురు ప్రముఖుల కవితలు, సాహిత్యంతో కూడిన హోర్డింగులు, బ్యానర్లతో ప్రత్యేకంగా అలంకరించడం సాహిత్యాభిమానులను అమితంగా ఆకర్షించింది.
1999 లో జ్ఞానపీఠ్ అవార్డు అలంకరించిన కుసుమగరాజ్ మరణం తర్వాత మహరాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును మరాఠి రాజ్యభాషా గౌరవ దినంగా నిర్వహిస్తూ... మరాఠీ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది నుంచి మరాఠీ సాహిత్యంలో ప్రతిభ చూపిన ఇద్దరికి ప్రత్యేక పురస్కారాలు అందించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా మొదటి భాషా సంవర్థక్ అవార్డును అహ్మద్ నగర్ కు చెందిన కూరగాయల వ్యాపారి బెబితాయ్ గైక్వాడ్ కు అందించింది.
తన సంపాదనలో ప్రతిరోజూ ఐదు రూపాయల చొప్పున పొదుపుచేసి సుమారు 900 పుస్తకాలను కొనేందుకు వెచ్చించిన హైస్కూల్ డ్రాపవుట్ బెబితాయ్ ఇప్పటివరకూ సుమారు 3,000 మరాఠీ సాహిత్య పుస్తకాలను చదివింది. పార్టీలో మరాఠీ అనుకూల వైఖరి ఉన్నప్పటికీ తమ పిల్లలను కాన్వెంట్ చదువులకు పంపడంపై వేడుకలకు హాజరైన ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ థాకరే సమర్థించుకున్నారు.