వరకట్న వేధింపులకు మహిళ బలి
తిరువళ్లూరు: వరకట్న వేధింపులకు తిరువళ్లూరు సమీపంలో మరో యువతి బలైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా ఒండికుప్పం గ్రామానికి చెందిన దాసన్ కుమార్తె కిరోషిక(22). అదే ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఎస్‌ఐ పళని కుమారుడు విష్ణుకుమార్. ఇద్దరు శ్రీపెరంబదూరులోని ప్రవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తోంది. అనంతరం వీరిద్దరూ 2015 ఆగస్టులో వివాహం జరిగింది.
ప్రస్తుతం కిరోషిక వానగరం సమీపంలోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తూ ఉండగా విష్ణుకుమార్ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరువురి కాపురం కొంత కాలం పాటు సజావుగా సాగినా, తరువాత వరకట్న వేధింపులు సాగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కిరోషిక మృతి చెందినట్టు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కిరోషిక బంధువులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పరిశీలించగా మృతదేహంపై గాయాలు ఉన్నట్టు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనపై పోలీసులు కిరోషిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా విష్ణుకుమార్‌ను సైతం అరెస్టు చేశారు. అయితే తమ కుమార్తె వరకట్నం కోసం నిత్యం వేధించే వారని, వరకట్నం తేలేదన్న కోపంతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించిన బంధువులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టుడించి ఆందోళనకు దిగారు. విష్ణుకుమార్ తండ్రి పళని, తల్లి కర్పగంలను అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని తీసుకోబోమని నినాదాలు చేశారు. దీంతో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీవో దివ్యశ్రీ మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు. నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు.