
భాస్కరుడికి ఐటీ ఉచ్చు
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ మెడకు ఐటీ ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ నిమిత్తం ఆయనకు సమన్ల జారీకి ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.
♦ సమన్లు జారీ అయ్యే అవకాశం
♦ మంత్రి తండ్రి, సోదరుడి విచారణ
♦ శేఖర్‌రెడ్డితో మిత్ర బంధం వెలుగులోకి
సాక్షి, చెన్నై: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ మెడకు ఐటీ ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ నిమిత్తం ఆయనకు సమన్ల జారీకి ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక, మంత్రి తండ్రి, సోదరుడ్ని ఆదాయ పన్ను శాఖ తీవ్రంగా విచారించడం గమనార్హం. నల్లధనం, అవినీతి కేసుల్లో చిక్కుకుని ఉన్న శేఖర్‌రెడ్డితో మిత్ర బంధం ఉన్నట్టు ఐటీ విచారణలో వెలుగు చూసింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల ప్రచార బిజీలో ఉన్న మంత్రి విజయభాస్కర్‌కు షాక్ ఇచ్చే రీతిలో ఆదాయపన్ను శాఖ శుక్రవారం మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే.
మంత్రితో పాటు అన్నాడీఎంకే అమ్మ శిబిరంతో సన్నిహితంగా ఉన్న వారందరి ఇళ్ల మీద ఈ దాడులు జరిగాయి. మొత్తం 55 చోట్ల దాడులు సాగినట్టు ఐటీ వర్గాలు ప్రకటించాయి. అయితే, మంత్రి విజయభాస్కర్, ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ గీతాలక్ష్మి ఇళ్లల్లో మాత్రం తనిఖీలు రాత్రంతా సాగాయి. పుదుకోట్టై జిల్లాలో ఉన్న మంత్రి కుటుంబీకులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో 22 గంటలపాటు సాగిన దాడుల్లో కీలక రికార్డులు, దస్తావేజులు బయట పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి.
అయితే, మంత్రి తండ్రి చిన్నతంబి ఇంట్లో ఏకంగా ఓ గదిని అధికారులు సీజ్ చేసి ఉండడం చర్చకు దారి తీసింది. అందులో ఏముందో అని పెదవి విప్పే వారే అధికం. ఇక మంత్రి క్వారీల్లోనూ కీలక రికార్డులు బయట పడ్డాయి. రూ. 5.5 కోట్ల నగదు పట్టుబడ్డట్టు, ఇది మంత్రికి సంబంధించిన నగదుగా తేలినట్టు సమాచారం. తండ్రి చిన్నతంబి, సోదరుడు ఉదయభాస్కర్‌లతో ఐటీ వర్గాలు రెండు గంటల పాటు జరిపిన విచారణలో పలు ప్రశ్నల్ని సంధించారు.
అందులో కొన్నింటికి సమాధానాలు మంత్రి ఆడిటర్ జయరామన్ ద్వారా ఇచ్చారు. తమ వద్ద అన్నింటికీ లెక్కలు ఉన్నట్టు మంత్రి తండ్రి, సోదరుడు స్పష్టం చేసినా, ఐటీ వర్గాలు మాత్రం తీవ్ర పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు. అవసరం అయితే, మంత్రిని విచారణకు పిలిపించేందుకు నిర్ణయించారు. ఇందుకుగాను సమన్ల జారీకి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మంత్రి మెడకు ఐటీ దాడుల ఉచ్చు బిగిసే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, నల్లధనం కేసులో పట్టుబడ్డ శేఖర్‌రెడ్డితో మంత్రికి సంబంధాలు ఉన్నట్టు ఐటీ విచారణలో తేలినట్టు సమాచారం.
మంత్రికి సంబంధించిన క్వారీల ద్వారా శేఖర్‌రెడ్డికి చెందిన, సన్నిహిత క్వారీల మధ్య లావాదేవిలు సాగినట్టు , ఇందుకు తగ్గ కీలక రికార్డులు, ఆధారాలు ఐటీ వర్గాల చేతిలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఈ దృష్ట్యా, మంత్రి తప్పించుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించే వాళ్లు పెరుగుతున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ సైతం తెర మీదకు రావడం గమనార్హం.