
ఢిల్లీని నాశనం చేయాలని చూస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీని నాశనం చేయాలని భావిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఇద్దరు కీలక బ్యూరోక్రాట్లను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అకస్మాత్తుగా బదిలీ చేయడంపై కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేశారు.
నజీబ్ జంగ్ మంగళవారం ఢిల్లీ ఆరోగ్య శాఖ కార్యదర్శి తరుణ్ సేన్, పీడబ్ల్యూడీ సెక్రటరీ శ్రీవాత్సవను బదిలీ చేశారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'లెఫ్టినెంగ్ గవర్నర్ ఈ రోజు కొంతమంది అధికారులను బదిలీ చేశారు. ముఖ్యమంత్రికి కానీ ఇతర మంత్రులకు కానీ ఫైల్స్ చూపలేదు. మోదీ తరహా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?' అని ప్రశ్నించారు. లెఫ్టినెంగ్ గవర్నర్ ద్వారా ఢిల్లీని నాశనం చేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అధికారులను బదిలీ చేయవద్దంటూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పలుమార్లు విజ్ఞప్తి చేసినా జంగ్ పట్టించుకోలేదని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ చూస్తున్నారని మంత్రులు ఆరోపించారు.