కూతురిని వ్యభిచార ముఠాకు..
-
కూతురిని విక్రయించడానికి ప్రియునితో కలిసి తల్లి కుట్ర
-
చాకచక్యంగా తప్పించుకున్న బాలిక
-
పోలీసుల అదుపులో నిందితులు
కూతురిని కంటికి రెప్పలా పెంచి, ఉజ్వల భవితను ఇవ్వాల్సిన తల్లి, తప్పుదారిని ఎంచుకుంది. విలాసాలు, డబ్బుల కోసం కూతురినే వ్యభిచార ముఠాకు అమ్మడానికీ వెనుకాడలేదు. మానవతా విలువలను ప్రశ్నించే ఈ సంఘటన బీదర్ నగరంలో వెలుగుచూసింది.
బెంగళూరు (బీదర్): డబ్బుల కోసం తనను వేశ్యవాటికకు విక్రయించడానికి ప్రయత్నించిన తల్లిని, ఆమె ప్రియుడిని ఒక బాలిక చాకచక్యంగా పోలీసులకు పట్టించిన ఘటన బీదర్‌లో గురువారం వెలుగు చూసింది. బీదర్ పట్టణంలోని కాలేజీలో చదువుతున్న బాలిక (17), తల్లి, చెల్లెళ్లలతో కలసి శివార్లలోని ఓ లేఅవుట్‌లో ఉంటున్నారు. కొద్దికాలం క్రితం ఆ మహిళ ప్రవర్తనతో విసిగి భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఖాజామియా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అప్పటి నుంచి ఖాజామియా ప్రతిరోజు వారింటికి వస్తూ బాలికను, ఆమె చెల్లెళ్లను దూషిస్తూ హింసించేవాడు. ఈ క్రమంలో డబ్బుపై మోజుతో ఇద్దరూ కలిసి బాలికను విక్రయించాలని కుట్ర పన్నారు. రాజస్థాన్ నుంచి పెళ్లి సంబంధం వచ్చిందని, వెంటనే దుస్తులు మార్చుకొని ప్రయాణానికి సిద్ధం కావాలంటూ బుధవారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన బాలికను ఒత్తిడి చేశారు.
కొద్దిసేపటికి ఖాజామియా బాలికను తీసుకువస్తున్నామని, వెంటనే తన బ్యాంకు ఖాతాలోకి రూ. 2 లక్షలు జమ చేయాలంటూ ఫోన్‌లో వేరే వ్యక్తులతో మాట్లాడడాన్ని పసిగట్టిన బాలిక తనను వేశ్యవాటికకు విక్రయిస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో కిటికీ నుంచి పక్కింటి వాళ్లకి విషయాన్ని తెలపడంతో వారు బాలిక బంధువులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు బీదర్ గ్రామీణ పోలీసులకు తెలిపి, అందరూ కలిసి బాలిక ఇంటికి వచ్చి ఆమెను రక్షించారు.
బాలిక ఫిర్యాదు మేరకు తల్లి, ఆమె ప్రియుడు ఖాజామియాలను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్ అమృత్ నికమ్ స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే బీదర్ గ్రామీణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలికను రక్షించారని చెప్పారు. తన తల్లి రమా, ఆమె ప్రియునితో కలిసి వేశ్యవాటికకు విక్రయించడానికి ప్రయత్నించందని బాలిక ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.