రాయగడ : జిల్లాలోని బిసంకటక్ సమితి రసికుల గ్రామపంచాయతీ కొడిగుడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తనకు జన్మించిన శిశువును విక్రయించేందుకు చేసిన ప్రయత్నం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. బిడ్డను ప్రసవించిన నాటి నుంచి శిశువును హత్య చేయాలని భర్త బెదిరించడంతో చివరికి ఆ పిల్లను విక్రయించేందుకు తల్లి ప్రయత్నించినట్లు తెలియవచ్చింది. గ్రామానికి చెందిన నారంగిపిడికాక, శీరపిడికాక దంపదులు. ఈనెల 11వతేదీన సహడ ఆరోగ్య కేంద్రంలో శీరపిడికాక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ కుటుంబ పరిస్థితి అతి దయనీయం. అంతేకాకుండా ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు.
ఇటీవల జన్మించిన శిశువు 8వ సంతానంగా తెలియవచ్చింది. ఈ దంపతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడమే కాకుండా వారికి మద్యం సేవించడం అలావాటు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి విచారణ చేపట్టగా భార్యాభర్తలు భయపడి దాక్కున్నారు. ఇది తెలుసుకున్న పోలీసులు చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం తెలియచేయగా వారు గ్రామానికి వచ్చి శిశువును రక్షించి తల్లిదండ్రులను చైతన్యం కల్పించారు. చివరికి బిడ్డను పెంచుకుంటామని తల్లిదండ్రులు అంగీకరించడంతో పత్రాలపై సంతకాలు తీసుకుని పోలీసులు వారిని విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment