
మోటర్ మేన్, గార్డును విధుల నుంచి తొలగించండి
‘చర్చిగేట్ రైలు ప్రమాద ఘటన’ నివేదికలో సూచించిన కమిటీ
రైల్వే అధికారుల నిర్లక్ష్యమూ ఉంద ని వెల్లడి
సాక్షి, ముంబై : చర్చిగేట్‌లో లోకల్ రైలు ప్రమాదానికి కారకులైన మోటర్ మేన్ (డ్రైవర్), గార్డును విధుల నుంచి తొలగించాలని దర్యాప్తు కమిటీ నివేదికలో సిఫార్సు చేసింది. ప్రమాదం తర్వాత మోటర్ మేన్ క్యాబిన్‌లోకి చొరబడిన మరో మోటర్ మేన్, లోకో ఇన్‌స్పెక్టర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది. చర్చిగేట్‌లో జూన్ 28న వేగంగా దూసుకు వచ్చిన ఓ లోకల్ రైలు బప్ఫర్ స్టాపర్లను ఢీ కొని ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పశ్చిమ రైల్వే పరిపాలన విభాగం ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కమిటీని నియమించింది.
మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని, విధుల్లో ఉన్న మోటర్ మేన్ ఎల్.ఎస్.తివారి, గార్డు అజయ్‌కుమార్ గుహేర్‌లను విధుల నుంచి తొలగించాలని కమిటీ పేర్కొంది. ప్రమాదం జరిగిన రోజు మోటర్ మేన్ తివారి డ్యూటీ ముగించుకునే తొందరలో మరో ప్లాట్‌ఫారంపై ఉన్న విరార్ లోకల్ రైలును ఎక్కే తొందరలో పొరపాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన రోజు డ్యూటీలో ఉండగా తివారి మొబైల్ ఫోన్ వినియోగించలేదని ఫోన్ కాల్స్ సమాచారం ద్వారా వెల్లైడె ంది.
అయితే ముందు జాగ్రత్త చర్యగా మోటర్ మాన్ క్యాబిన్‌లో మొబైల్ జామర్ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. లోకల్ రైలు బప్ఫర్ స్టాపర్లు, స్టేషన్‌లో ఉన్న బప్ఫర్ స్టాపర్లు సమాంతరంగా లేకపోవడంవల్ల రైలు వాటిని ఢీ కొట్టి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిందని, బప్ఫర్ స్టాపర్లు సమాంతరంగా ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండే దపి రైల్వే అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా కమిటీ వేలెత్తి చూపించింది.