సాక్షికి మురసోలి కితాబు
చెన్నై: ‘సాక్షి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తకు మురసోలి పత్రికలో ప్రాధాన్యత కల్పించారు. ఈనెల మూడో తేదీన చెన్నైలో ఈలం తమిళులకు మద్దతుగా డీఎంకే నేతృత్వంలో భారీ ఆందోళన జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చారుు. కరుణానిధి నేతృత్వంలో జరిగిన ఈ నిరసన సాక్షి చెన్నై పత్రికలో ప్రథమంగా ప్రచురితమైంది. అయితే ఈ నిరసన పేలవంగా సాగినట్లు ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనానికి మురసోలిలో ప్రత్యేక కథనం శనివారం ప్రచురించారు.
ఇతర భాషా పత్రికలు సైతం ఈలం తమిళులకు మద్దతుగా నిలుస్తూ , డీఎంకే నిరసనను ప్రథమంగా ప్రచురిస్తే తమిళ పత్రిక వ్యతిరేకత వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని ఆ కథనంలో ఖండించారు. ఆ నిరసన విజయవంతం అయినట్టుగా సాక్షిలో వచ్చిన ఫోటో, వార్తల క్లిప్పింగ్‌ను మురసోలి పత్రిక ప్రథమంగా ప్రచురించి సాక్షిని చూడండంటూ పేర్కొనడం విశేషం. కాగా ఈ మురసోలి తమిళ పత్రిక డీఎంకే అధినేత అయిన కరుణానిధికి, డీఎంకే పార్టీకి చెందినది కావడం విశేషం.