Murasoli paper
-
‘మురసోలి’ సెల్వమ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్ సోదరుడు, డీఎంకే అధికార పత్రిక మురసోలి మాజీ ఎడిటర్ మురసోలి సెల్వమ్(84) గురువారం ఉదయం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.కరుణానిధి సోదరి కుమారుడే సెల్వమ్. మురసోలి పత్రికకు సిలంది పేరిట 50 ఏళ్లపాటు సంపాదకుడిగా పనిచేశారు. పలు తమిళ సినిమాలకు ప్రొడ్యూసర్‌గాను ఉన్నారు. కరుణానిధి కుమార్తె సెల్విని ఆయన వివాహమాడారు. సీఎం ఎంకే స్టాలిన్‌కు బావ అవుతారు. ‘మంచి రచయిత, జర్నలిస్ట్ కూడా అయిన సెల్వమ్ డీఎంకే భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు’అని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. మురసోలి సెల్వమ్ మృతితో తమిళనాడు ప్రభుత్వం 10వ తేదీ నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. -
‘రజనీకాంత్ ఓ తోలుబొమ్మ’
చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ కొందరి చేతుల్లో తోలు బొమ్మగా మారారని.. మతతత్వ అంశాలకు మద్దతిస్తున్నారని డీఎమ్‌కే ఆరోపించింది. ఈ సందర్భంగా డీఎమ్‌కే, తన పార్టీ అధికార పత్రిక మురసోలిలో రజనీకాంత్‌ని పలు అంశాల గురించి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ‘మీరు(రజనీకాంత్) రాజకీయాల్లోకి వచ్చే ముందు పాలిటిక్స్‌ను ప్రక్షాలన చేస్తాను. డబ్బు, హోదాలపై నాకు వ్యామోహం లేదని ప్రకటించారు. ఏ పదవులు అక్కరలేదంటున్న మీరు వచ్చే ఎన్నికల్లో 234 స్ధానాల్లో పోటీ చేస్తానని ఎందుకు ప్రకటించారు. మీడియాలో మీ గురించి మాట్లాడేవారంతా మతతత్వ వాదులు. కొంతమంది మీ పేరు వాడుకోని లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నారు. వారు తమిళనాడును చీల్చడానికి కుట్ర పన్నుతున్నారు’ అన్నారు. అంతేకాక ‘అభిమానులుగా మేము మిమ్మల్ని నమ్ముతాం. కానీ మీరు కొందరి చేతుల్లో తోలు బొమ్మగా మారి.. వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మిమ్మల్ని అలా ఆడిస్తోన్న ఆ బ్లాక్ షీప్ ఎవరో చెప్పండి. ఓ అమాయకపు అభిమానిగా నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. సమాధానం చెప్పండి’ అంటూ ప్రశ్నించారు. -
‘మురసొలి’తో పాత్రికేయుడిగా..
సాక్షి, చెన్నై: దక్షిణామూర్తి అలియాస్ ముత్తువేలర్ కరుణానిధి అన్ని రంగాల్లోనూ ఆరితేరిన వారే. మీడియా రంగంలో ఆయన అరంగేట్రం మురసొలితో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం లో 18 ఏళ్ల వయసులో ఆయన కలం చేబట్టారు. స్వస్థలం తిరువారూర్ వేదికగా 1942 ఆగస్టు 10 నుంచి ‘మురసొలి’పేరుతో కరపత్రాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఇందులో వ్యాసాలు, సమాచారాన్ని ‘చేరన్’బై లైన్‌తో రాసేవారు. కరపత్ర పత్రికగా ప్రజల్లోకి వచ్చిన మురసొలికి 1940 నుంచి కొంత కాలం బ్రేక్ పడింది. 1944 జనవరి 14 నుంచి వారపత్రికగా ఆవిర్భవించింది. తిరువారూర్ నుంచి చెన్నై కోడంబాక్కం వేదికగా 1954 నుంచి మురసొలి పత్రిక వచ్చింది. 1960 సెప్టెంబర్ 17 నుంచి దినపత్రికగా మారింది. కలైజ్ఞర్ పేరుతో చానళ్లు మురసొలి దినపత్రికగా మారినా రోజూ కరుణానిధి పేరిట ఓ కాలం ఉండేది. 2016లో అనారో గ్యం బారిన పడిన తర్వాత కరుణ పేరిట కాలం ఆగింది. డీఎంకే అధినేతగా, సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత పత్రిక వ్యవహారాలను ఆయన మేనళ్లుడు మురసొలి మారన్ చేపట్టారు. ఆ తదు పరి మురసొలి మారన్ తనయులు, దయానిధి మారన్, కళానిధి మారన్ నేతృత్వంలో సన్ గ్రూప్ ఆవిర్భావం, దినకరన్ దినప్రతిక చిక్కడం వెరసి కరుణకు కలసి వచ్చాయి. 2007లో కలైజ్ఞర్ పేరుతో టీవీ చానళ్లు పుట్టుకు రావడంతో మీడి యాలో కరుణ కుటుంబం కీలకంగా మారింది. తెలుగువారి భాషా స్ఫూర్తి భేష్ సాక్షి ప్రతినిధి, చెన్నై: కరుణానిధి తండ్రి తమిళుడైనా తల్లి మాతృభాష తెలుగు కావడంతో తెలుగువారిపై మక్కువ కనబరిచేవారు. అంతేగాక ఒక సభలో తెలుగువారికి మంచి కితాబు ఇచ్చారు. చెన్నైలో ప్రముఖుడైన డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షునిగా అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) స్థాపించిన తరువాత తొలి ఉగాది వేడుకలను 1990లో యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ వేడుకలకు గంట సమయం మాత్రమే కేటాయించిన అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి 3 గంటలపాటు కూర్చుండిపోయారు. ‘చెన్నైలో జరిగిన ఉగాది వేడుకలకు ఇంతమంది తెలుగువారా. కొన్నేళ్ల క్రితం తెలుగువారు లేనిదే తమిళనాడు లేదు కదా. వివిధ పార్టీలకు చెందిన నేతలను ఒకే వేదికపై చూస్తుంటే ముచ్చటేస్తోంది. తెలుగుభాషపై ఉన్న మమకారమే వారందరినీ కలిపింది. ఇలాంటి భాషా స్ఫూర్తితోపాటూ తెలుగువారి నుంచి తమిళులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది..’అంటూ కరుణానిధి తెలుగువారిని కొనియాడారు. -
బాహ్య ప్రపంచంలోకి కరుణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏడాదికిపైగా ఇంటికే పరిమితమైన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి(93) గురువారం బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఏడాదిగా ఎవరినీ కలవడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరుకావడం లేదు. కరుణానిధి సోదరి భర్త మురసోలిమారన్ తన పేరుతో పెట్టిన పార్టీ పత్రిక ‘మురసొలి’ 75 వ వార్షికోత్సవ వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకూ కరుణ రాలేదు. ఈ సందర్భంగా కోడంబాక్కంలోని పత్రిక కార్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు గురువారం రాత్రి కరుణానిధి కార్యాలయానికి వచ్చారు. ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన కరుణానిధి మైనపు బొమ్మను ఆయన ఆసక్తిగా తిలకించి విజిటర్స్ రిజిస్టర్లో సంతకం చేశారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కరుణ వెంట వచ్చారు. -
సాక్షికి మురసోలి కితాబు
చెన్నై: ‘సాక్షి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తకు మురసోలి పత్రికలో ప్రాధాన్యత కల్పించారు. ఈనెల మూడో తేదీన చెన్నైలో ఈలం తమిళులకు మద్దతుగా డీఎంకే నేతృత్వంలో భారీ ఆందోళన జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చారుు. కరుణానిధి నేతృత్వంలో జరిగిన ఈ నిరసన సాక్షి చెన్నై పత్రికలో ప్రథమంగా ప్రచురితమైంది. అయితే ఈ నిరసన పేలవంగా సాగినట్లు ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనానికి మురసోలిలో ప్రత్యేక కథనం శనివారం ప్రచురించారు. ఇతర భాషా పత్రికలు సైతం ఈలం తమిళులకు మద్దతుగా నిలుస్తూ , డీఎంకే నిరసనను ప్రథమంగా ప్రచురిస్తే తమిళ పత్రిక వ్యతిరేకత వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని ఆ కథనంలో ఖండించారు. ఆ నిరసన విజయవంతం అయినట్టుగా సాక్షిలో వచ్చిన ఫోటో, వార్తల క్లిప్పింగ్‌ను మురసోలి పత్రిక ప్రథమంగా ప్రచురించి సాక్షిని చూడండంటూ పేర్కొనడం విశేషం. కాగా ఈ మురసోలి తమిళ పత్రిక డీఎంకే అధినేత అయిన కరుణానిధికి, డీఎంకే పార్టీకి చెందినది కావడం విశేషం.