ముష్కురుల తూటాలకు.. నేలకొరిగిన సాహితీ దిగ్గజం
ధార్వాడలో కలబుర్గి దారుణ హత్య
విద్యార్థులమంటూ వచ్చి కాల్పులు జరిపిన ఆగంతకులు
దుఃఖసాగరంలో కర్ణాటక
నివాళులు అర్పించిన సీఎం, మంత్రులు
నేడు ధార్వాడలో అంత్యక్రియలు
దార్వాడ(సాక్షి, బళ్లారి) : ప్రముఖ సాహితీ దిగ్గజం, పరిశోధకుడు, బళ్లారి జిల్లా హంపి విశ్వవిద్యాలయ మాజీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ ఎం.ఎం.కలబుర్గి(77) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ధార్వాడలోని ఆయన సృగహం వద్ద వాకింగ్ చేస్తున్న అక్కడకు చేరుకున్న ఇద్దరు తాము కలబుర్గి పూర్వ విద్యార్థులమని ఆయన భార్య ఉమాదేవితో పరిచయం చేసుకుని ఇంటి తలుపులు తీయించారు. అనంతరం అక్కడే వాకింగ్ చేస్తున్న కలుబుర్గిపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పిస్తోలుతో కాల్పులు జరిపి పారిపోయారు. బులెట్లు దూసుకెళ్లడంతో కుప్పకూలిన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల ప్రయత్నం ఫలించకపోవడంతో ఆయన ధార్వాడ ప్రభుత్వాస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఘటనతో యావత్ కర్ణాటక దిగ్భ్రాంతికి గురైంది. కలబుర్గికి భార్య ఉమాదేవి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కలబుర్గి ఉన్నత విద్యను అభ్యసించి యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ స్థాయికి ఎదిగారు. కన్నడ సాహిత్యంపై ఎన్నో సంశోధనాత్మక పరిశోధనలు చేస్తూ కర్ణాటకలో చెరగని ముద్ర వేసుకున్నారు. అజాతశత్రువుగా పేరుగాంచిన ఆయన హత్య కర్ణాటకలో చర్చానీయాంశమైంది. కలబుర్గి హత్యకు గురైన విషయం తెలియగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు, బీజేపీ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బెళగావి రేంజ్ ఐజీ ఉమేష్ కుమార్, ధారవాడ పోలీస్ కమిషనర్ రవీంద్ర తదితరులు ఘటన స్థలం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పోలీస్ కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ... కలబుర్గి హత్య కేసు మిస్టరీ చేధించేందుకు ప్రత్యేక పోలీృస బందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. కాగా, పోస్టుమార్టం అనంతరం ఆయన ృుతదేహాన్ని కుటుంబసభ్యులకు వైద్యులు అప్పగించారు. విషయం తెలిసిన వెంటనే హంపి వర్సిటీ విద్యార్థులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఆదివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పలువురు మంత్రులు అక్కడకు చేరుకుని నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ధార్వాడలో నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కలబుర్గి స్వస్థలం విజయపుర జిల్లా : 1938లో విజయపుర జిల్లా సింధగి తాలూకాలో గుబ్బెవాడలో మడివాళప్ప, గౌరమ్మ దంపతులకు కలబుర్గి జన్మించారు. ఆయన అంచెలంచెలుగా వైస్‌చాన్స్‌లర్ స్థాయి కి ఎదిగారు. విద్యాభ్యాసం అనంతరం 1962లో ధార్వాడ కర్ణాటక కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తూ 1966లో కర్ణాటక విశ్వవిద్యాలయంలో బోధకుడుగా చేరారు. అనంతరం 1982లో కన్నడ విశ్వవిద్యాలయం అధ్యయన పీఠానికి ముఖ్యస్థులుగా పని చేశారు. అనంతరం 1998 నుంచి 2001 వరకు బళ్లారి జిల్లా హంపి కన్నడ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్‌గా పని చేస్తూ పదవీ విరమణ చేశారు. హంపి యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌గా పని చేస్తూ 400కు పైగా పరిశోధనలు చేసి రికార్డు నెలకొల్పారు.
క్షమించరాని నేరం : సిద్ధు
బెంగళూరు : కన్నడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి డాక్టర్ ఎం.ఎం.కలబుర్గి హత్య క్షమించరాని నేరమని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాహితీ జగత్తులో తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకున్న కలబుర్గి హత్యకు గురికావడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు.