కమలం వికసించేనా..!
Published Sat, Sep 28 2013 10:58 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రకటించినప్పటినుంచి బీజేపీ ఢిల్లీప్రదేశ్ శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పదిహేనే ళ్లుగా ఢిల్లీపీఠాన్ని ఏలుతున్న కాంగ్రెస్‌పార్టీని గద్దెదించే సత్తా నరేంద్రమోడీకే ఉందని స్థానిక నాయకుల విశ్వాసం. అటు నరేంద్రమోడీ సైతం మరికొద్ది రోజుల్లో జరగనున్న ఢిల్లీ విధానసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కమలం వికసించడానికి ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. తన ప్రభావం ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోవడంతోపాటు ప్రధానమంత్రి పదవిని హస్తగతం చేసుకోవడానికి హస్తిన నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలన్నది ఆయన ఆలోచనగా స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.
యువతపైనే దృష్టి:
ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు యువత మనసు గెలుచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కార్యక్రమాలతో యువతను పెద్ద సంఖ్యలో ఆమ్‌ఆద్మీ పార్టీ తమవైపు తిప్పుకుంటోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ అన్ని కార్యక్రమాల్లో ఎక్కువ భాగస్వామ్యం యువతదే. దీంతో యువతీ యువకులను బీజేపీ వైపు మార్చే శక్తి కేవలం నరేంద్రమోడీ ప్రసంగానికి మాత్రమే ఉందని ఢిల్లీ బీజేపీ నాయకులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దీంతో ఆదివారం జపనీస్ పార్క్‌లో నరేంద్రమోడీ చేయనున్న ప్రసంగంపై అంతా ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలకన్నా.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజధానిలో చేయనున్న అభివృద్ధి పైనే ప్రముఖంగా మోడీ ప్రసంగం కొనసాగుతుందని పార్టీ నేత ఒకరు తెలిపారు.
ఇప్పటికే డీయూ అడ్మిషన్లలో కటాఫ్ మార్కుల అంశంలో అందరి కంటే ముందుండి పోరాడిన క్రెడిట్‌తో డీయూ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నాయకులు మరోమారు నరేంద్రమోడీ ప్రసంగంతో యువతీయువకులంతా కమలదళం వైపు నడుస్తారని ఆశిస్తున్నారు. ఇన్నేళ్లుగా సరైన వ్యూహాలు అమలు చేయలేకపోవడంతో ప్రతిసారీ ఢిల్లీపీఠాన్ని దక్కించుకోలేకపోతున్న బీజేపీ ఢిల్లీ నాయకులకు మోడీ రాక కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. పార్టీ నేత ల మధ్య సైతం సఖ్యత పెరిగింది. మోడీ సభ కోసం చేసిన ఏర్పాట్లలో బీజేపీ ఢిల్లీప్రదేశ్ మాజీ అధ్యక్షుడు విజయేంద్రగుప్తా కీలక పాత్ర పోషించగా, ప్రస్తుత అధ్యక్షుడు విజయ్‌గోయల్, విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా కలిసికట్టుగా ఏర్పాట్లు సమీక్షించారు. ఆదివారం జరగనున్న మోడీ సభతోనే ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో తమ భవితవ్యం తేలనుందని స్థానిక నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
నరేంద్ర మోడీ ర్యాలీపై నిరసనల వెల్లువ
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆదివారం నగరంలో ‘వికాస్ ర్యాలీ’ నిర్వ హించనున్న నరేంద్ర మోడీకి స్థానిక ముస్లిం, సిక్కు సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మోడీ ర్యాలీకి వ్యతిరేకంగా శనివారం నగరంలోని పలు విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రయో జనం పొందడానికే ఇటీవల కాలంలో బీజేపీ మత ఘర్షణలను ప్రోత్స హిస్తోం దని వారు ఆరోపించారు. ఇందులో భాగమే ‘ముజఫర్ నగర్ ఘర్షణలు అని వారు విమర్శించారు. ఇదిలా ఉండగా, గుజరాత్‌లో సిక్కు రైతులకు భూమి హక్కుపై జరుగుతున్న పోరాటంలో, వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన మోడీ ప్రభుత్వంపై స్థానిక సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై తన కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాకే మోడీని సభలో మాట్లాడనిస్తామని సిక్కు సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఢిల్లీలో సుమారు 10 లక్షలకుపైగా ఉన్న సిక్కుల ఆగ్రహాన్ని తట్టుకుని మోడీ సభను స్థానిక పార్టీ నేతలు ఎలా విజయవంతం చేస్తారో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement