vikas rally
-
కిక్కిరిసిన ఢిల్లీ
సాక్షి, న్యూఢిల్లీ: మోడీ ప్రభం‘జనం’ ముందు వరుణుడు తప్పుకున్నాడు. వికాస్‌ర్యాలీలో పాల్గొనేందుకు ఆపార్టీ కార్యకర్తలు, మోడీ అభిమానులు ఉదయం ఆరు గంటల నుంచే వరుసకట్టారు. సమయం గడుస్తున్నకొద్దీ జపనీస్‌పార్క్‌కి దారితీసే మార్గాల్లో వాహనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ మందకొడిగా కదిలింది. దీంతో కొన్నిచోట్ల రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఏ రోడ్డులో చూసిన బీజేపీ జెండాలు, నరేంద్ర మోడీ ఫొటోలు అంటించి ఉన్న కార్లు, బస్సులే కనిపించాయి. సభ ప్రారంభమైన గంట వరకు కొంతమంది వేదిక వద్దకు చేరుకోలేకపోయా రు. ముఖ్యంగా కార్లు సొంత వాహనాల్లో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు నిండిపోవడంతో వాహనదారులు అవస్తలు పడాల్సి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసికూడా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంతో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. వికాస్ ర్యాలీకి వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నాయకుల విజ్ఞప్తి మేరకు డీఎంఆర్సీ అదనంగా మెట్రోరైళ్లను నడిపింది. రెడ్‌లైన్‌లోని మెట్రోరైళ్లలో రద్దీ అంతకంతకు పెరిగింది. దాదాపు 50 వేల మంది వరకు మెట్రోరైళ్లను వినియోగించుకుని ర్యాలీకి హాజరయ్యారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఒకేసారి తిరుగుప్రయాణపు టికెట్లు కూడా ఇచ్చారు. అదే విధంగా ఒక్కరి ఒక్క టోకెన్ కాకుండా మొత్తం బృందానికి కలిపి ఒకటే టోకెన్ ఇవ్వడంతో ప్రయాణికులకు కాస్త ఊరట కలిగింది. రిటాలా మెట్రోస్టేషన్ నుంచి సభా ప్రాంగణానికి వె ళ్లేందుకు అందుబాటులో ఉంచిన ఫీడర్‌బస్సులు సైతం కిక్కిరిసిపోయాయి. సభ పూర్తయిన తర్వాత ఒకేమారు అంతా తిరుగు ప్రయాణం కావడంతో మెట్రో స్టేషన్ పరిసరాలు రద్దీగా కనిపించాయి. రెడ్‌లైన్‌లో మొత్తం 26 మెట్రోరైళ్లను అదనంగా నడిపినట్టు డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్ తెలిపారు. -
న్యూఢిల్లీలో మోడీ వికాస్ ర్యాలీ
-
మన్మోహన్, షీలాలపై నిప్పులు చెరిగిన నరేంద్రమోడీ
కేంద్రంలోని యూపీఏ సర్కార్‌ను గద్దెదించేందుకు ప్రతినబూనాలిని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమెడీ యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ఉంది యూపీఏ డర్టీ టీమ్ అని అభివర్ణించారు. 2014 ఎన్నికల తర్వాత దేశానికి డ్రీమ్ టీమ్ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం న్యూఢిల్లీలోని జపనీస్ పార్క్‌లో బీజేపీ ఏర్పాట్ చేసిన వికాస్ ర్యాలీలో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ యూపీఏ సర్కార్‌తోపాటు న్యూఢిల్లీలోని షీలా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మన్మోహన్ సింగ్ అసమర్థ ప్రధాని అని ఆయన ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించడంలో యూపీఏ దారుణంగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ అవినీతిని సుప్రీం కోర్టు ఎన్ని సార్లు తప్పుపట్టిన, తన తీరు మార్చుకోలేదన్నారు. అవినీతి అనేది యూపీఏ సర్కార్‌కు అలవాటుగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో భారత్‌ను చూసీ ప్రపంచ దేశాలు అపహాస్యం చేస్తున్నాయన్నారు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో ప్రభుత్వం పలు అక్రమాలకు పాల్పడి దేశం పరువు గంగలో కలిపారని అన్నారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా వ్యహారించిన తీరును మోడీ తప్పు పట్టారు. మన్మోహన్ యూఎస్ పర్యటనలో పేదరికాన్ని మార్కెట్ చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పేదరికాన్ని సినిమాల్లో చూపించి అవార్డులు అందుకునేవారిలా ప్రధాని వ్యవహారించారని మోడీ వ్యాఖ్యానించారు. అలాగే ఆ పర్యటనలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ భేటీని మోడీ ఈ సందర్బంగా ప్రశ్నించారు. నవాజ్ షరీఫ్ ప్రధాని మన్మోహన్‌ను అవమానించేలా మాట్లాడారని అన్నారు. భారతదేశాన్ని వేలెత్తి చూపే సత్తా ప్రపంచంలో ఏ దాశానికి లేదన్నారు. ప్రధానికి సొంత పార్టీలోనే గౌరవం లభించకపోతే బయట వారు ఎలా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు. యూపీఏ సర్కార్‌ను గద్దెదించేందుకు ప్రతినబూనాలిని మోడీ యువతకు పిలుపునిచ్చారు. యూపీఏ డర్టీ టీమ్ అని ఆయన అభివర్ణించారు. బొగ్గు, గ్యాస్ అందుబాటులో లేక అనేక విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. యూపీఎ ప్రభుత్వ విఫలం అవడం వల్లే దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. రైల్వేల అభివృద్దిలో జపాన్‌తో చైనా పోటీ పడుతోంది. మనం మాత్రం రైల్వే అభివృద్ధిలో ఎక్కడ ఉన్నం అని ఆయన ప్రశ్నించారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలు సొంత ప్రభుత్వాలు నడుపుతున్నాయని ఆయన ఆరోపించారు. మోడీ న్యూఢిల్లీలోని షీలా ప్రభుత్వంపై విరుచుకుప్పడ్డారు. తల్లిదో ప్రభుత్వం, కొడుకుదో ప్రభుత్వం, అల్లుడిదో ప్రభుత్వం షీలాపై వ్యంగాస్త్రాలను సంధించారు. ఢిల్లీలో ఏం జరిగినా షీలా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తోందని ఆరోపించారు. ఏలాంటి తప్పు జరిగిన అంతా కేంద్రంపైనే నెట్టివేస్తోందని అన్నారు. షీలా ప్రభుత్వానికి అది ఓ అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు. బయటకు వెళ్లిన ఆడపిల్లలు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలని షీలాదీక్షిత్ సలహా ఇస్తున్నారని మోడీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాని మహిళలపై దాడులను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి పక్షవాతం వచ్చింది, అందుకే ఏ పనీ చేయట్లేదని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ఎంపికైన తర్వాతా న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న మొట్టమొదటి సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరైయ్యారు. -
నేడు న్యూఢిల్లీలో మోడీ వికాస్ ర్యాలీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 'వికాస్ ర్యాలీ' నిర్వహించనున్నారు. ఆ ర్యాలీతో న్యూఢిల్లీలో తమ పార్టీకి పూర్వవైభవం వస్తుందని భారతీయజనతాపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 1999 నుంచి వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలవుతోంది, మోడీ సభతో ఢిల్లీ సీఎం పీఠం మరల కైవసం చేసుకోంటుందని ఆ పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. అయితే రోహిణి ప్రాంతంలోని జపనీస్ పార్క్ వేదికగా ఏర్పాటు చేసిన వికాస్ ర్యాలీకి దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని నిర్వాహాకులు వెల్లడించారు. అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు వివరించారు. ఢిల్లీ మొట్రో రైలు కార్పొరేషన్ ప్రత్యేక రైళ్లు నడుపుతోందని తెలిపారు. అలాగే ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసిన తరువాత న్యూఢిల్లీలో జరుగుతోన్న మొట్టమొదటది వికాస్ ర్యాలీ అని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆ ర్యాలీకి హాజరుకాలేని వారి కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు బీజేపీ వివరించింది, ఆ ర్యాలీకి న్యూఢిల్లీ ఎన్నికల ఇన్ చార్జ్ నితీన్ గడ్కారీతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. -
కమలం వికసించేనా..!
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రకటించినప్పటినుంచి బీజేపీ ఢిల్లీప్రదేశ్ శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పదిహేనే ళ్లుగా ఢిల్లీపీఠాన్ని ఏలుతున్న కాంగ్రెస్‌పార్టీని గద్దెదించే సత్తా నరేంద్రమోడీకే ఉందని స్థానిక నాయకుల విశ్వాసం. అటు నరేంద్రమోడీ సైతం మరికొద్ది రోజుల్లో జరగనున్న ఢిల్లీ విధానసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కమలం వికసించడానికి ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. తన ప్రభావం ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోవడంతోపాటు ప్రధానమంత్రి పదవిని హస్తగతం చేసుకోవడానికి హస్తిన నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలన్నది ఆయన ఆలోచనగా స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. యువతపైనే దృష్టి: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు యువత మనసు గెలుచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కార్యక్రమాలతో యువతను పెద్ద సంఖ్యలో ఆమ్ఆద్మీ పార్టీ తమవైపు తిప్పుకుంటోంది. ఆమ్ఆద్మీ పార్టీ అన్ని కార్యక్రమాల్లో ఎక్కువ భాగస్వామ్యం యువతదే. దీంతో యువతీ యువకులను బీజేపీ వైపు మార్చే శక్తి కేవలం నరేంద్రమోడీ ప్రసంగానికి మాత్రమే ఉందని ఢిల్లీ బీజేపీ నాయకులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దీంతో ఆదివారం జపనీస్ పార్క్‌లో నరేంద్రమోడీ చేయనున్న ప్రసంగంపై అంతా ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలకన్నా.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజధానిలో చేయనున్న అభివృద్ధి పైనే ప్రముఖంగా మోడీ ప్రసంగం కొనసాగుతుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఇప్పటికే డీయూ అడ్మిషన్లలో కటాఫ్ మార్కుల అంశంలో అందరి కంటే ముందుండి పోరాడిన క్రెడిట్‌తో డీయూ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నాయకులు మరోమారు నరేంద్రమోడీ ప్రసంగంతో యువతీయువకులంతా కమలదళం వైపు నడుస్తారని ఆశిస్తున్నారు. ఇన్నేళ్లుగా సరైన వ్యూహాలు అమలు చేయలేకపోవడంతో ప్రతిసారీ ఢిల్లీపీఠాన్ని దక్కించుకోలేకపోతున్న బీజేపీ ఢిల్లీ నాయకులకు మోడీ రాక కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. పార్టీ నేత ల మధ్య సైతం సఖ్యత పెరిగింది. మోడీ సభ కోసం చేసిన ఏర్పాట్లలో బీజేపీ ఢిల్లీప్రదేశ్ మాజీ అధ్యక్షుడు విజయేంద్రగుప్తా కీలక పాత్ర పోషించగా, ప్రస్తుత అధ్యక్షుడు విజయ్‌గోయల్, విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా కలిసికట్టుగా ఏర్పాట్లు సమీక్షించారు. ఆదివారం జరగనున్న మోడీ సభతోనే ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో తమ భవితవ్యం తేలనుందని స్థానిక నాయకులు ఆశలు పెట్టుకున్నారు. నరేంద్ర మోడీ ర్యాలీపై నిరసనల వెల్లువ బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆదివారం నగరంలో ‘వికాస్ ర్యాలీ’ నిర్వ హించనున్న నరేంద్ర మోడీకి స్థానిక ముస్లిం, సిక్కు సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మోడీ ర్యాలీకి వ్యతిరేకంగా శనివారం నగరంలోని పలు విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రయో జనం పొందడానికే ఇటీవల కాలంలో బీజేపీ మత ఘర్షణలను ప్రోత్స హిస్తోం దని వారు ఆరోపించారు. ఇందులో భాగమే ‘ముజఫర్ నగర్ ఘర్షణలు అని వారు విమర్శించారు. ఇదిలా ఉండగా, గుజరాత్లో సిక్కు రైతులకు భూమి హక్కుపై జరుగుతున్న పోరాటంలో, వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన మోడీ ప్రభుత్వంపై స్థానిక సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై తన కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాకే మోడీని సభలో మాట్లాడనిస్తామని సిక్కు సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఢిల్లీలో సుమారు 10 లక్షలకుపైగా ఉన్న సిక్కుల ఆగ్రహాన్ని తట్టుకుని మోడీ సభను స్థానిక పార్టీ నేతలు ఎలా విజయవంతం చేస్తారో వేచి చూడాల్సిందే.