గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 'వికాస్ ర్యాలీ' నిర్వహించనున్నారు. ఆ ర్యాలీతో న్యూఢిల్లీలో తమ పార్టీకి పూర్వవైభవం వస్తుందని భారతీయజనతాపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 1999 నుంచి వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలవుతోంది, మోడీ సభతో ఢిల్లీ సీఎం పీఠం మరల కైవసం చేసుకోంటుందని ఆ పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. అయితే రోహిణి ప్రాంతంలోని జపనీస్ పార్క్ వేదికగా ఏర్పాటు చేసిన వికాస్ ర్యాలీకి దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని నిర్వాహాకులు వెల్లడించారు. అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు వివరించారు.
ఢిల్లీ మొట్రో రైలు కార్పొరేషన్ ప్రత్యేక రైళ్లు నడుపుతోందని తెలిపారు. అలాగే ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసిన తరువాత న్యూఢిల్లీలో జరుగుతోన్న మొట్టమొదటది వికాస్ ర్యాలీ అని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆ ర్యాలీకి హాజరుకాలేని వారి కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు బీజేపీ వివరించింది, ఆ ర్యాలీకి న్యూఢిల్లీ ఎన్నికల ఇన్ చార్జ్ నితీన్ గడ్కారీతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.