పాలనా దక్షతే... సుపరిపాలనకు రక్ష | More Governance and Less Government | Sakshi
Sakshi News home page

పాలనా దక్షతే... సుపరిపాలనకు రక్ష

Published Thu, Apr 23 2015 3:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

More Governance and Less  Government

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల  సందర్భంగా భారతీయ జనతా పార్టీ  ప్రధాన మంత్రిత్వ అభ్యర్థి నరేంద్రమోదీ  ‘ఎక్కువ పరిపాలన - తక్కువ ప్రభుత్వం’  (More Governance and Less  ) అనే నినాదాన్నిచ్చారు.  ఇది విద్యావంతులైన యువతరాన్ని  ఎంతగానో ఆకర్షించింది. ఇంతకీ పరిపాలన-  సుపరిపాలన- ప్రభుత్వం అనే భావనల మధ్య  తేడా ఏంటి? భారతదేశంలో సుపరిపాలన  సాధ్యమేనా? అవరోధాలేంటి? వాటిని  ఎలా అధిగమించాలి? దీనికి సమాధానం...  పాలనా దక్షతే అనడంలో సందేహం లేదు.
 
 పరిపాలన (Governance) అనే పదానికి గ్రీకు భాషలోని  అనేది మూల పదం. దీనికి అర్థం సారథ్యం వహించడం. సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ప్లాటో మొదటిసారిగా ఈ పదాన్ని రూపకాలంకారం (Metaphorical) గా వాడారు. అనంతరం లాటిన్, ఇంగ్లిష్ భాషల్లో ఈ పదాన్ని పలు అర్థాలతో వాడారు. కాలానుగుణంగా దీని వాడకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ భావనను ‘పాలక చర్య’ గా నిర్వచించడం జరుగుతోంది. నాయకత్వ, నిర్వహణ ప్రక్రియలో ఒక అంశంగా పరిగణిస్తున్నారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో ప్రభుత్వం న్యాయ బద్ధంగా, నైతికంగా తన కార్యకలాపాలను నిర్వహించడమే పరిపాలన (ఎౌఠ్ఛిట్చఛ్ఛి) అని భాష్యం చెప్పాడు. మహాత్మా గాంధీ దృష్టిలో రామరాజ్య భావనేసుపరిపాలన. ‘ నియమ నిబంధనల మేరకు అధికారాన్ని వినియోగించే ప్రవృత్తి (Process) పరిపాలన’ అని చెప్పవచ్చు.
 
 సుపరిపాలనకు కొలమానాలు
 ప్రపంచబ్యాంకు 1989వ సంవత్సరంలో సహారా ఎడారి దిగువ (ఠఛ్చజ్చిట్చ) ఉన్న ఆఫ్రికా దేశాల్లో పాలనా ప్రక్రియను మెరుగు పరచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ పరిపాలన, సుపరిపాలన అనే పదాలను తాను రూపొందించిన నివేదికలో ప్రస్తావించింది. అప్పటినుంచి ఈ భావాలకు విస్తృత ప్రచారం లభించింది. ప్రపంచబ్యాంకు 1996లో విడుదల చేసిన అధ్యయనంలో పరిపాలనకు సంబంధించి ఆరు ప్రామాణిక కొలమానాలను (Dimensions)ప్రస్తావించింది. అవి 1. జవాబుదారీ తనం, 2. రాజకీయ సుస్థిరత, 3. ప్రభావవంతమైన ప్రభావం, 4. గుణాత్మక నియంత్రణ, 5. సమన్యాయ పాలన , 6. అవినీతిని అదుపులో పెట్టడం. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో ఒకటైన ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (యూన్‌డీపీ ) 1997లో సుపరిపాలన ప్రధాన లక్షణాలను గుర్తించింది. వాటిలో 1. భాగస్వామ్యం, 2. సమన్యాయ పాలన , 3. పారదర్శకత. 4. ప్రతిస్పందన(Responsiveness), 5. ఏకాభిప్రాయం, 6. సమత, 7. ప్రభావవంతం, సమర్థత, 8. జవాబుదారీతనం, 9. వ్యూహాత్మక దృష్టి (Strategic Vision). పరిపాలన, సుపరిపాలన అనే ఈ రెండు పదాలు దాదాపు ఒకే అర్థంతో వాడటం జరుగుతుంది. కాకపోతే సుపరిపాలన అనే పదం సకారాత్మక భావనను కలిగిస్తే, పరిపాలన అనే పదం తటస్థ (ూ్ఛఠ్టట్చ) భావననిస్తుంది. మరి ప్రభుత్వమంటే ఏంటి? శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థల కార్యకలాపాలకు సంబంధించినది.
 
 అన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రజారంజకంగా వ్యవహరిస్తాయని చెప్పలేం. అధికార దుర్వినియోగం, అసమర్థత, అవినీతి మొదలైన అవలక్షణాలు ప్రభుత్వ వ్యవస్థలలో కనిపిస్తున్నాయి. వీటిని నివారించి బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రవృత్తిని సుపరిపాలన/పరిపాలన అనే అర్థంతో వాడుతున్నారు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు మార్కెట్, పౌర సమాజం ప్రజా వసరాలను తీర్చడంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. వీటి సమష్టి కృషినే సుపరిపాలన/పరిపాలనగా అభివర్ణించడం జరుగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా పౌర సంక్షేమానికి జరిపే కార్యకలాపాలన్నీ సుపరిపాలన / పరిపాలనలో అంతర్భాగాలే. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమేణా తగ్గుతూ పౌర సమాజ పాత్ర పెరగడం సుపరిపాలన లక్షణం.
 
 సుపరిపాలన అంటే ఎలా ఉండాలి?
 1.నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలను మెరుగుపరచాలి.
 2.మౌలిక సదుపాయాలైన రహదారులు, వంతెనలు, విద్యుచ్ఛక్తి, టెలిఫోన్, నీటిపారుదల, రవాణా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండాలి.
 3.సమర్థవంతంగా శాంతి భద్రతలను నిర్వర్తిస్తూ ఆస్తి, ప్రాణ రక్షణ కల్పించాలి.
 4.ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలి.
 5.సమర్థనీయ, ప్రభావవంతమైన ప్రభుత్వం ఉండాలి.
 6.వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలి.
 7.సమాజంలోని కృత్రిమ అసమానతలు తొలగించడానికి అణగారిన వర్గాలకు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించాలి.
 8.ప్రాథమిక హక్కులను అనుభవించడానికి అనుకూల పరిస్థితులు కల్పించడం. ఈ విధంగా పైన ప్రస్తావించిన అంశాల్లో ప్రభుత్వం జోక్య రహిత విధానాన్ని అవలంబించాలి.
 9.పౌరులు ప్రధాన కేంద్ర బిందువుగా సేవలు (Citizen centric servicesట) అందించాలి.
 10.ఎలాంటి వివక్షను చూపకుండా స్వచ్ఛమైన సేవలను పౌరులకు చేరేలా చూడాలి.
 సుపరిపాలన-ఎదురవుతున్న సమస్యలు
 
 అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలతో పోల్చిచూస్తే... మన దేశం గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరాలంటే నేరపూరిత రాజకీయాలు, అవినీతి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. నేరమ య రాజకీయ ప్రవృత్తి, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారవేత్త లు, మాఫియా శక్తులు ఒక విషవలయంగా రూపొందాయి.ప్రభుత్వ విధాన రూపకల్పన, అమల్లో ఈ దుష్టశక్తుల ప్రభావం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. సుపరిపాలనకు అరిష్టాలు ఈ దుష్ట చతుష్టయమే.
 
 అదృష్టవశాత్తూ చురుకైన పౌర సమాజం, క్రియాశీలక న్యాయ వ్యవస్థ, శక్తిమంతమైన ప్రసార మాధ్యమాలు వీరి ఆటకట్టించడానికి తమవంతు కృషి చేస్తున్నాయి. కళంకితులు, నేర పూరితులైన రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారవేత్తలు కటకటా లపాలయ్యారు. అయితే కొందరు ధన,రాజకీయ బలాలతో బెయిలు సంపాదించి తిరిగి అవే నేరాలను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని(1951) సవరించి నేర చరితుల్ని ఎన్నికల్లో పోటీచేయడాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు, అక్రమ సంపాదనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుగా అవినీతి వ్యతిరేక చట్టాన్ని(1989) మరిం త పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
 
 అలాంటప్పుడే సుపరిపాలన సుసాధ్యమవుతుంది. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల వేలంలో అక్రమాలు... ఇలా చెప్పుకుంటూ పోతే భారీ కుంభకోణాలెన్నో దేశంలో వెలుగుచూశాయి. నేటి ఏలికల ఏలుబడిలో ఇలాంటి అవినీతి పర్వాలు సర్వసాధారణమయ్యాయి. అవినీతికి పాల్పడటం మానవ నైజమని సమర్థించడం తప్పు. వ్యవస్థాపరమైన లొసుగులు, జవాబుదారీతనం లోపించడం, కఠినతరమైన శిక్షలు అమలుచేయకపోవడం,సగటు పౌరునిలో నిరాసక్తత,పటిష్టమైన లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పడకపోవడం లాంటివి సుపరిపాలన పరిమళాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం, శక్తిమంతమైన అవినీతి నిరోధక వ్యవస్థలు పనిచేయడం ప్రా రంభమైననాడే సర్కారు సుపరిపాలనను అందించగలదు.
 
 సుపరిపాలన శోభిల్లాలంటే...
 సత్పరిపాలనను కోరుకోవడం పౌరుని హక్కు. దాన్ని పొందాలంటే జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పాలనా యంత్రాంగం అవసరం. గాంధీజీ కలలు గన్న అంత్యోదయ సూత్రానికి ప్రాధాన్యతనిస్తే సుపరిపాలన సాధ్యమవుతుంది. ప్రజల సగటు ఆదాయం పెరుగుతుంది. సంపూర్ణ అక్షరాస్యత సాకారమవుతుంది. సరైన వైద్య సదుపాయాలు కల్పించి సగటు ఆయుః ప్రమాణాన్ని పెంచవచ్చు. ప్రతి పౌరునిలో దేశభక్తి, సత్యాన్వేషణ, రుజు ప్రవర్తన ప్రభవిల్లినప్పుడే ఏలికలు తలపెట్టిన సుపరిపాలన చిరకాలం శోభిల్లుతుంది.
  సుపరిపాలన - ప్రభుత్వం చొరవ
 
 1.సమాచార హక్కు:
 ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కేంద్ర బిందువు. ప్రతి పౌరునికి ప్రభుత్వ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించాలి. ఇది సమాచార హక్కు ద్వారానే లభిస్తుంది. రాజ్యాంగంలోని 19వ ప్రకరణలో ప్రస్తావించిన వాక్ స్వాతంత్య్రపు హక్కు ద్వారా సమాచార హక్కు లభిస్తుంది. 2005 నుంచి అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (Right to Information Act)భారత ప్రజాస్వామ్యంలో గణనీయమైన మార్పునకు నాంది పలికింది. దీనిద్వారా సగటు పౌరునికి సాధికారత చేకూరింది. ప్రభుత్వ కార్యక్రమాల అమలును పరిశీలించడానికి, సామాజిక తనిఖీలకు సమాచార హక్కు చట్టం వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారం ఎలాంటి అడ్డంకుల్లేకుండా సకాలంలో సగటు పౌరునికి అందుబాటులో ఉన్నప్పుడే జవాబుదారీ తన ంతో పాటు సుపరిపాలన అందించడానికి వీలవుతుంది.
 
 ప్రభుత్వంలో వేళ్లూనిన అవినీతిని అరికట్టడానికి సమాచార హక్కు చట్టం వజ్రాయుధం. అయితే దురదృష్టవశాత్తూ ఇది కొందరికే పరిమితమైపోతోంది. ఇప్పటికీ విద్యావంతుల్లో చాలామందికి దీనిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం విచారకరం. ఉద్యోగ స్వామ్య సహాయ నిరాకరణ ధోరణి, రాజకీయ నాయకుల నిర్లిప్తత సగటు పౌరునికి పెను శాపంగా మారింది. కుంటి సాకులతో కోరిన సమాచారాన్ని నిరాకరించడం, ఒకవేళ అందించినా అందులో సమగ్ర సమాచారం లేకపోవడం జరుగుతోంది. ప్రభుత్వోద్యోగుల వ్యతిరేక వైఖరిని సవాలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లు ఉన్నప్పటికీ వాటి ప్రతిస్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థ పౌరునికి దన్నుగా నిలుస్తుందనుకోవడం భ్రమే.
 
 2.ఇ - పాలన (E-Governance)
 సమాచార, ప్రసార సాంకేతిక యుగంలో ఎలక్ట్రానిక్ పాలనకు నాంది పలకడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో సాంప్రదాయ పాలన స్థానంలో ఎలక్ట్రానిక్ పాలన ఊపందుకుంది. దీనిద్వారా పౌరునికి నాణ్యమైన సేవలు మరింత వేగంగా, చౌకగా లభిస్తున్నాయి. ప్రభుత్వంతో జరిపే లావాదేవీలు పారదర్శకంగా జరగడంతో అవినీతికి, జాప్యానికి అవకాశాలు సన్నగిల్లాయి. సేవలందిస్తున్న వ్యవస్థలను పౌరులతో ప్రత్యక్షంగా అనుసంధానించడంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఏర్పడింది. బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీలు అర్హులైన వారికి అందుతు న్నాయి. ప్రభుత్వ రంగంలో దుబారాను తగ్గించడానికి ఎలక్ట్రానిక్ పాలన అనువైన సాధనం. ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వాలంటే ప్రభుత్వోద్యోగుల్లో నిబద్ధత, రాజకీయ మద్దతు, సరిపడే వనరులు అవసరం. నిరక్షరాస్యత, పేదరికం, అరకొర ఇంటర్నెట్ సదుపాయా లు, సగటు పౌరుల్లో అవగాహనా రాహిత్యం మొదలైనవి ఇ-పాలనకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి.
 
 3.ఆధార్‌కార్డు:
 దేశంలో శాశ్వత ప్రాతిపదికన నివశించే ప్రతివ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Identification Number) ను కేటాయించారు. ఇటీవల కాలంలో కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్ యోజన అమలుకు బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించి మొబైల్ ద్వారా అర్థిక పరమైన లావాదేవీలను కొనసాగించడానికి (ఒఅక) వీలు కల్పించారు.  నిర్దేశిత వ్యక్తికి ప్రభుత్వం కల్పించే రాయితీలు చేరడానికి ఆధార్‌కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. బోగస్ లబ్ధిదారులను ఏరివేయడానికి ఆధార్ అవసరం. ప్రభుత్వం పెట్టే ఖర్చు దుర్వినియోగం కాకుండా, అసలు వ్యక్తులకే ప్రభుత్వ సేవలు అందడానికి ఇది సరైన సాధనం. ఆధార్‌కార్డు విస్తృత వినియోగం సుపరిపాలనకు దోహదం చేస్తుంది. అయితే ఆధార్ జారీ చేయడంలో కొన్ని అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, భారతీయులు కానివారు కూడా వీటిని పొందడానికి వీలవుతుందనే విమర్శలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement