
నటరాజన్‌తో ప్రపంచ సుందరి
నట్టి అలియాస్ నటరాజన్ సరసన ప్రపంచ సుందరి నటించనుంది. చతురంగం చిత్రంతో సక్సెస్‌ఫుల్ హీరోగా పేరుతెచ్చుకున్న నటరాజన్ ప్రముఖ ఛాయాగ్రాహకుడు కూడా. పలు హిందీ చిత్రాలకు పనిచేసిన ఈయన ఇటీవల విజయ్ నటించిన పులి చిత్రానికి ఛాయాగ్రహణం నెరిపారన్నది గమనార్హం. నటరాజన్ తాజాగా మళ్లీ కథానాయకుడిగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన నటించనున్న చిత్రానికి బొంగు అనే పేరును నిర్ణయించారు. ఇందులో ఆయనకు జంటగా 2014లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న రుషీసింగ్ నటించనున్నారు. ఇతర పాత్రల్లో అతుల్‌కుల్‌కర్ణి, ముండాసిపట్టి రాందాస్, రాజన్, పాండినాడు చిత్ర విలన్ శరత్‌లోహిత్ కౌర్, మనీషా శ్రీ, అర్జునన్ తదితరులు నటించనున్నారు.
ఈ చిత్రానికి నవ దర్శకుడు తాజ్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు. ఈయన కళా దర్శకుడు శిబుసిరిల్ శిష్యుడన్నది గమనార్హం. ఇది రోడ్డు ప్రయాణాల్లో ఎలాంటి గోల్‌మాల్‌లు జరుగుతాయనేది తెరపై ఆవిష్కరించే కథా చిత్రమని దర్శకుడు తెలిపారు. ప్రేమ, హాస్యం, యాక్షన్ తదితర కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రంగా బొంగు చిత్రం ఉంటుందని అన్నారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని రఘుకుమార్ నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్‌ను రజనీకాంత్ పుట్టిన రోజైన డిసెంబర్ 12 న ప్రారంభించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చెన్నై, ముంబై, మధురై,దిండిగల్ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు.