‘ఎయిడ్స్’ వివక్షకు రెండేళ్ల జైలు
♦ రూ. లక్ష జరిమానా కూడా
♦ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపితే 3 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బిల్లు 2014 (సవరణలు)కు ప్రధాని మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ద్వారా వ్యాధిగ్రస్తుల హక్కులను కాపాడటంతోపాటు.. వారి ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది.
ఈ బిల్లు అమల్లోకి వస్తే యాంటీరిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసుపత్రులు, విద్యాలయాలతోపాటు పలుచోట్ల హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష కనబరిస్తే శిక్ష అనుభవించక తప్పదని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు.
తొలి మెడికల్ పార్కుకు ఓకే..
దేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలను ఉత్పత్తి చేసే మెడికల్ పార్కు ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. చెన్నై దగ్గర్లోని చెంగల్‌పట్టు ప్రాంతంలో 300 ఎకరాలను హెచ్‌ఎల్‌ఎల్ కంపెనీకి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా భారతదేశంలో తక్కువ ధరకే ముఖ్యమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ‘మేకిన్ ఇండియా’ ద్వారా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి.