చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీరంగం నియోజకవర్గంలో భారీ సంఖ్యలో నకీలీ ఓటర్లున్నారని ఆరోపణలు వచ్చినందున కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ఆదేశించారు. అనేక సవరణలతో ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, ముఖ్యంగా ఉప ఎన్నికలు జరుగుతున్న శ్రీరం గం నియోజకవర్గ పరిధిలో 9 వేల మంది నకిలీ ఓటర్లు చేరిపోయారని డీఎంకే తరపున ఆ పార్టీ నేత ఆర్‌ఎస్ భారతి ఈనెల 19న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సైతం సమర్పించింది. నకిలీ ఓటర్ల పేర్లను ఫొటోలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందజేసింది.
నకిలీ ఓటర్ల జాబితా సైతం సిద్ధం అవుతోంది. అయితే ఒకే ఊరును అనేక పేర్లతో పిలుస్తున్న కారణంగా నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ఉప ఎన్నిక జరిగే శ్రీరంగంను తిరువరంగం అని కూడా సంబోధించడంతో ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, న్యాయశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఊరిపేర్లను గుర్తించేందుకు ఒక బృందం సిద్ధమైంది. ఒక ఊరిని ఇలాగే పిలవాలి, రాతల్లో సైతం ఇలాగే పేర్కొనేలా ఉత్తర్వులను ఈ బృందం జారీ చేస్తుంది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు చేపట్టనున్నారని సందీప్ సక్సేనాను మీడియా ప్రశ్నించగా, డీఎంకే ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తిరుచ్చిరాపల్లి జిల్లా క లెక్టర్‌ను ఆదేశించానని తెలిపారు. ఈ ఆదేశాల మేరకు శ్రీరంగం నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించి కొత్త జాబితాను సిద్ధం చేయనున్నామని తెలిపారు. ఒకే ఓటరు పేరు రెండుచోట్ల ఉండడం, మరణించిన వారు, ఇంటి చిరునామా మారిన వారి పేర్లను తొలగించకుంటే వారికోసం వేరుగా మరో జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు.
శ్రీరంగంలో నామినేషన్ల దాఖలు ప్రారంభమైనందున ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగా నకిలీ ఓటర్లను గుర్తించి శ్రీరంగం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లకు వారి వివరాలను పంపుతామన్నారు. నకిలీ ఓటర్లు ఓటువేయకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఒకే ఊరికి రెండు మూడు పేర్లు ఉన్నందున తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తామని, అధికారికంగా ఊరిపేర్ల ఖరారు తరువాత మరింత మంది నకిలీ ఓటర్లను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అలాగే ఈనెల 18వ తేదీ వరకు ఓటర్లుగా చేరిన వారికి కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తామని తెలిపారు.
పరిశీలకునిగా శ్రీధర్ ధోరా
శ్రీరంగంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పరిశీలకునిగా శ్రీధర్ దోరాను నియమించామని, ఆయన 18వ తేదీ నుంచే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఏమైనా ఫిర్యాదులు చేయదలుచుకుంటే 9438917128 నెంబరుకు ఫోన్ చేయవచ్చని చెప్పారు. ప్రధాన పరిశీలకునిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సింగ్ అనే ఐఆర్‌ఐ అధికారిని నియమించారని, ఈనెల 27న సింగ్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే శ్రీరంగంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, నాలుగు చెక్‌పోస్టులతో నిఘా పెట్టినట్లు చెప్పారు. అవసరమైన పక్షంలో మరిన్ని ఫ్లయింగ్ స్క్వాడ్‌లను పంపుతామని తెలిపారు.
ఈసీ కొరడా
Published Wed, Jan 21 2015 1:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement
Advertisement