నిడో హంతకులపై కఠిన చర్యలు | Nido Taniam`s death: Delhi CM Arvind Kejriwal joins protest | Sakshi
Sakshi News home page

నిడో హంతకులపై కఠిన చర్యలు

Published Tue, Feb 4 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

Nido Taniam`s death: Delhi CM Arvind Kejriwal joins protest

 న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిడో తనియ (19) హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. దోషులను కఠినంగా శిక్షించడానికి సాధ్యమైనంత కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై చర్చించడానికి కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి నినొంగ్ ఎరింగ్ నేతృత్వంలోని ఈశాన్య ప్రాంత విద్యార్థుల బృందం ప్రధానితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ‘నిడో మరణానికి అసలు కారణమేంటో పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుంది. ఇతని హత్య తరువాత హింస జరగడం విషాదకరం’ అని అన్నారు. ఢిల్లీలోని ఈశాన్యవాసులందరికీ పటిష్ట భద్రత కల్పిస్తామని ప్రధాని స్పష్టీకరించారు. ‘మిగతా ప్రజలందరి మాదిరే ఈశాన్యవాసులకు కూడా ఢిల్లీలో సమానస్థానం ఉంటుంది. వీళ్లంతా సురక్షిత భావనతో జీవించేందుకు మిగతా ప్రజలు కూడా సహకరించాలి. నేడు మానవతా విలువలు ప్రమాదంలో పడిపోతున్నాయి. ఐకమత్య భావన దెబ్బతింటోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 దోషులపై కఠినంగా వ్యవహరిస్తాం : కేజ్రీవాల్ 
 అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థి నిడో తనియ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇలాంటి జాతివివక్షాపూరిత చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. నిడో హత్యకు నిరసనగా జంతర్‌మంతర్ వద్ద మంగళవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఇది వరకే మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ‘ఇది చాలా దురదృష్టకర ఘటన. 
 
 ఇది కేవలం ఈశాన్య ప్రజల పోరాటమే కాదు..మనందరి పోరాటం. జాతివివక్షకు వ్యతిరేకంగా అందరం ఉద్యమించాలి. ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో ఈశాన్య రాష్ట్రాల చరిత్ర గురించి పాఠాలు కూడా ప్రవేశపెడతాం’ అని ఆయన పేర్కొన్నారు. కొందరు నేతలు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని హామీ ఇస్తున్నా ఏమీ జరగబోదంటూ పరోక్షంగా రాహుల్‌గాంధీ ప్రకటనను విమర్శించారు. నిడో హత్యను నిరసిస్తూ జంతర్‌మంతర్‌లో సోమవారం కూడా జరిగిన ఆందోళనకు హాజరైన రాహుల్ బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం నాటికి ఆందోళనకు మంత్రి మనీశ్ సిసోడియా సైతం హాజరయ్యారు.
 
 దోషులపై కఠిన చర్యలు: షిండే హామీ
 నిడో హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మంగళవారం ఎరింగ్ బృందానికి హామీ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరామని మంత్రి ఎరింగ్ అన్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఈశాన్యవాసుల సమస్యలను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని కూడా నియమిస్తామని తెలిపాయి. అయితే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతోపాటు ఘటనకు బాధ్యులైన ఢిల్లీ పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల బృందం హోంమంత్రిని కోరింది. ఎరింగ్ బృందం సోమవారం రాహుల్‌గాంధీని కూడా కలిసి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. 
 
 ముగ్గురు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ
 నిడో హత్య కేసులో అరెస్టయిన ముగ్గురికి స్థానిక కోర్టు ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిందితులు సుందర్‌సింగ్, పవన్ ఫర్మానియా, ఫర్మాన్‌ను జైలుకు తరలించాల్సిందిగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పవన్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, వీరిలో ఇద్దరు మైనర్లని పోలీసులు తెలిపారు. నిడో పోస్టుమార్టం తుది నివేదికను ఎయిమ్స్ ఇంకా అందజేయలేదని పేర్కొన్నారు. 
 
 డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోన్న నిడో తానియ జనవరి 29న లజ్‌పత్‌నగర్‌లోని మిత్రుని ఇంటికి బయలుదేరాడు. ఏ బ్లాక్‌లో నివసించే మిత్రుని ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవడానికి అదే బ్లాకులోని ఓ మిఠాయి దుకాణంలో అడిగాడు. దుకాణంలో కూర్చున్న ఇద్దరు సోదరులు ఫర్మాన్, రిజ్వాన్ తన జుట్టును చూసి గేలి చేయడం నిడో తనియంకు కోపం తెప్పించింది. దాంతో ఫర్మాన్, రిజ్వాన్‌తో వాదనకు దిగాడు. కోపం ఆపుకోలేక దుకాణం గ్లాసును బద్దలుకొట్టాడు. దానితో ఫర్మాన్, రిజ్వాన్ , మరికొందరు కలిసి నిడోను చితకబాదారు. దెబ్బలు తిన్న నిడో పోలీసులు, తన మిత్రులకు ఫోన్ చే శాడు. ఘటనా స్థలానికి చేరుకు న్న మిత్రులు కూడా స్థానికులతో ఘర్షణకు దిగారు. మరునాడు ఉదయం గ్రీన్‌పార్క్ ఎక్స్‌టెన్షన్‌లోని గదిలో ఈ యువకుడి మృతదేహం కనిపించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement