తెలుగు రాష్ట్రాల్లో ఆ ధరలు యథాతథం
తెలుగు రాష్ట్రాల్లో ఆ ధరలు యథాతథం
Published Thu, Jul 6 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
హైదరాబాద్: ఎల్పీజీ సిలిండర్ విషయంలో తెలుగురాష్ట్రాల ప్రజలకు కొంత ఊరట కలుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం యథాతథంగా ఉంటున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులు అంతకముందు పన్ను విధానంలో 5 శాతం వ్యాట్ చెల్లించేవారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన జీఎస్టీ కింద కూడా ఎల్పీజీ సిలిండర్‌దారులు 5 శాతం పన్ను పరిధిలోకే వస్తున్నారు. దీంతో తెలుగురాష్ట్రాల ప్రజలకు ధరల్లో పెద్ద తేడా కనిపించడం లేదు. వ్యాట్ స్థానంలో ఈ జీఎస్టీ వచ్చిందని, అంతేతప్ప మరే తేడా లేదని తెలంగాణ ఎల్పీజ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే.జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.
వ్యాట్ లేని ప్రాంతాల్లో మాత్రమే ఈ ధరలు పెరుగుతున్నట్టు తెలిపారు. అయితే వ్యాట్ లేని రాష్ట్రాల్లో మాత్రం జీఎస్టీతో ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధరపై 32 రూపాయల మేర పెరిగింది. ఢిల్లీలో ఎలాంటి వ్యాట్ లేకపోవడంతో అంతకముందు 446.65 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం 477.46 రూపాయలకు ఎగిసింది. ఢిల్లీ, ఛండీగర్, జమ్ముకశ్మీర్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, కొన్ని ఉత్తర రాష్ట్రాల్లో వ్యాట్ లేదా విక్రయపన్ను జీరోగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో 1 శాతం నుంచి 5 శాతంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధర 613.50 రూపాయలుండగా.. దీనిలో 482 రూపాయలు వినియోగదారులు భరిస్తున్నారు. మిగతా 131 రూపాయల సబ్సిడీ కింద ప్రభుత్వం కన్జ్యూమర్ అకౌంట్లలోకి జమచేస్తోంది.
Advertisement
Advertisement