విధి ఆటలో నటినయ్యా
తాప్సీ మంచి నటి మాత్రమే కాదు బహుభాషా ప్రావీణ్యురాలు. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ చిత్రం జాతీయ అవార్డును పొందింది. అలాంటిది తాప్సీకి అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే. టాలీవుడ్‌లోనూ ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం ఝుమ్మంది నాదం ప్రజాదరణ పొందింది. అయినా అక్కడ కూడా తాప్సీ క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయారు. ఆమె సహ నటీమణులు కాజల్ అగర్వాల్, తమన్న ఆ తరువాత పరిచయమైన సమంత, శ్రుతిహాసన్ వంటి వారు టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. వీరి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి.
తాప్సీకి మాత్రం ఆశించిన అవకాశాలు లేవు. ప్రస్తుతం ఈమె లారెన్స్ సరసన నటిస్తున్న ముని-3 చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. తన కెరీర్ గురించి ఆలోచనలో పడ్డ తాప్సీ కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ తాను మంచి అందగత్తెనే. అభినయంలో ఎవరికీ తీసిపోను అన్నారు. అయినా ఆశించిన అవకాశాలు లేవనే బాధను వ్యక్తం చేశారు. అసలు తాను చక్కగా చదువుకుని ఏదైనా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని ఆశించానన్నారు. తలరాత నటిని చేసింది. సినిమాకు వచ్చి తాను చాలా పెద్ద తప్పు చేశానని అనుకుంటున్నాననే ఆవేదన వ్యక్తం చేశారు. నటినయినందుకు చింతిస్తున్నాను. ఇతరుల కంటే అందం, ప్రతిభ వున్నా తనకు అవకాశాలు ఎందుకు రావడం లేదు. ఇది నిజంగా బాధాకరమేనని తాప్సీ పేర్కొన్నారు.