= డిమాండ్ ఉన్నా.. అనుమతిచ్చే ప్రసక్తే లేదు
= దీనిపై సీఎం, విపక్షాలతో భేటీ అవుతా
= రాష్ర్టంలో తగ్గిన నాటు సారా తయారీ
= దశలవారీగా అబ్కారీ శాఖలో 1,700 పోస్టులు భర్తీ
= అబ్కారీ శాఖ మంత్రి సతీశ్ జారకిహొళి వెల్లడి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలకు అనుమతినిచ్చే ప్రతిపాదనలేవీ లేవని అబ్కారీ శాఖ మంత్రి సతీశ్ జారకిహొళి స్పష్టం చేశారు. కొత్త అంగళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘కొత్త అంగళ్లకు అనుమతినిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
గతంలో కూడా ఇలా జరిగింది. కనుక కొత్త అంగళ్లకు అనుమతి ఇవ్వరాదన్న ప్రభుత్వం విధానంలో ఎలాంటి మార్పూ లేదు’ అని వివరించారు. అయితే కొత్త అంగళ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నందున, దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని అన్నారు. అవసరమైతే ప్రతిపక్షాలతో కూడా మాట్లాడతానని అన్నారు. అప్పటి వరకు కొత్త అంగళ్ల ప్రస్తావన ఉండబోదన్నారు. అవసరమైన చోట్ల ఎంఎస్‌ఐఎల్ నుంచి చిల్లర దుకాణాలను ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇప్పటికే 400 దుకాణాలకు అనుమతినిచ్చినప్పటికీ, 200 అంగళ్లు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త దుకాణాలకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో నాటు సారా ఉత్పత్తి 85 శాతం వరకు నిలిచిపోయిందన్నారు. నాటుసారాతో జీవనం సాగించిన రెండు వేల కుటుంబాలను గుర్తించామని, వీరికి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పిస్తామని తెలిపారు.
1,700 పోస్టుల భర్తీ
అబ్కారీ శాఖలో 2,200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి చెప్పారు. వీటిలో 1,700 పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతినిచ్చిందని తెలిపారు. దశలవారీ రెండేళ్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే 200 మంది ఇన్‌స్పెక్టర్లు, 300 మంది గార్డుల నియామక ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా లభించినందున కొంత జాప్యం జరిగిందని చెప్పారు. కాగా చిల్లర దుకాణాల్లో నిర్ణీత ధర కంటే ఎక్కువగా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై చర్యలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది అబ్కారీ ఆదాయ లక్ష్యం రూ.12,400 కోట్లు కాగా తొలి ఆరు నెలల్లో ఆరు వేల కోట్లను గడించామని చెప్పారు.
నూతన మద్యం దుకాణాలకు అనుమతివ్వం
Published Tue, Nov 19 2013 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement