చెన్నై వాసుల కష్టాలు
చెన్నై: కుండపోత వర్షాలతో తమిళవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వరద నీరు ముంచెత్తడంతో తినడానికి తిండి దొరక్క, తాగడానికి మంచి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సుమారు నెల రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై వాసుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మొత్తం నగరమంతా నీటిలో ముగినిపోయింది.
ఒక్క రాజకీయ నాయకుడు కూడా తమను పలకరించిన పాపాన పోలేదని బాధితులు వాపోయారు. తిండి దొరక్క తమ పిల్లలు అలమటించిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీళ్లు లేవనని చెప్పారు. తమ రేషన్ కార్డులు, గుర్తింపు పత్రాలు వరదల్లో కొట్టుకుపోయాయని బాధితులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
కాగా, తమిళనాడులో వరదలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటూ బెంగళూరులో కొంతమంది ప్రత్యేక యగాలు, యజ్ఞాలు చేశారు. తమిళవాసుల కష్టాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు.